సురవరం ద లీడర్!
posted on Aug 23, 2025 9:06AM
లీడర్.. తన పార్టీకి, కేడర్‌కు, జాతి భవితకు ఓ రాడార్. తన మాటతో, చేతతో కార్యకర్తలను కదంతొక్కించడమే కాదు, తన వాగ్ధాటితో, వాదనా పటిమతో ప్రత్యర్థులను నిరుత్తరులను చేయడం, మేధావులు, నిపుణులు, విశ్లేషకుల మద్దతు పొందడంద్వారానే నాయకుడనిపించుకుంటారు. అటువంటి సమర్ధ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి. అధ్యయనం, అవగాహన, ఆచరణ.. త్రివేణి సంగమంగా మదిలో, హృదిలో మథనంతో జనాభ్యుదయం, దేశ హితం కాంక్షించి, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆజన్మాంతం కమ్మూనిస్టు పార్టీతో కలిసి నడిచిన నేత సురవరం సుధాకరరెడ్డి. మతవాద, మితవాద రాజకీయాల్లోని క్రూరత్వాన్ని, కుటిలత్వాన్ని, స్వార్థపూరిత దోపిడీ విధానాలను ఎండగడుతూ లౌకిక, ప్రజాతంత్ర శక్తులకు అండగా నిలిచిన నేత సురవరం సుధాకరరెడ్డి. నమ్మిన సిద్ధాంతాల కోసం ఆజన్మాంతం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు. నిజమైన ప్రజా ఉద్యమ నాయకుడు సురవరం సుధాకరరెడ్డి. పాఠశాల స్థాయి నుంచే ప్రశ్నించడం నేర్చుకుని, విద్యార్థి దశ నుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్నారు. తన వాగ్దాటితో జనార్షక నేతగా ఎదిగారు. తన అధ్యయనం, సైద్ధాంతిక బలంతో దార్శనికునిగా ఎదిగారు.
భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా, ఎటువంటి భేషజాలు లేకుండా సామాన్యులలో సామాన్యుడిగా ప్రజలతో మమేకమయ్యారు. రజాకార్లు తమ ఇంటిని తగలబెట్టినా, కుటుంబాన్ని వెంటాడినా వెరవకుండా ప్రజా ఉద్యమబాట వదలకుండా సాగారు. ప్రతి ప్రతిబంధకాన్నీ తన పోరాటానికి నిచ్చెన మెట్లుగా మలచుకున్న నిజమైన ప్రజానాయకుడు సురవరం సుధాకరరెడ్డి. ప్రజా పోరాటాలలో పాల్గొని జైలు పాలైనా కూడా ఆ చెరసాలనే మరింత ఉధృతమైన పోరాటాలకు పురిటి గదిగా మార్చుకున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య పరిష్కారం కోసం పోరాటంలో ముందున్నారు. పోరాటాల గడ్డ నల్లగొండ నుంచి పార్లమెంటులో అడుగుపెట్టినా.. కార్యకర్త నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగినా ఆయన ఆలోచన, ఆచరణలో ఏ మార్పులేదు.
నిరాడంబరత ఆయన శైలి. నల్లకుబేరుల జాతకాలపై తొలిసారి పార్లమెంటు వేదికగా గళం విప్పిన ఘనత సురవరం సొంతం. అటువంటి ప్రజాపోరాట యోధుడు సురవరం సుధాకరరెడ్డి శుక్రవారం (ఆగస్టు 22) రాత్రి కన్నుమూశారు. సురవరం మృతికి సంతాపం తెలుపుతూ.. అలుపెరుగని ఆ పోరాట యోధుడికి నివాళులర్నిస్తోంది తెలుగువన్.