పాలమూరు- రంగారెడ్డి పనులకు సుప్రీం ఓకే.. ఎన్బీటీ జరిమానాపై స్టే
posted on Feb 17, 2023 @ 3:28PM
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఒకే రోజు రెండు వేర్వేరు కేసులకు సంబంధించి ఎదురు దెబ్బ, ఊరట లభించాయి. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీంలో తెలంగాణ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలితే.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి భారీ ఊరట లభించింది.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు కేసీఆర్ సర్కార్ కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి విధించిన 900 కోట్ల రూపాయల జరిమానాపై స్టే విధించింది. జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ ఎమ్.ఎమ్. సుందరేష్ లతో కూడిన ధర్మాసనం పాలమూరు-రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్టు కు ఆమోదం తెలిపింది.
తదుపరి విచారణ ఆగస్టు నెలకు వాయిదా వేసింది. 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది అంటే రిజర్వాయర్ స్థాయి వరకూ ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగించవచ్చని పేర్కొంది. అలాగే రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేసే కాలువల నిర్మాణ పనులను సాగునీటి ప్రాజెక్టుగా పరిగణించుకుని ప్రాజెక్టు పనులకు యథావిధిగా కొనసాగించేందుకు తెలంగాణ సర్కార్ కు మార్గం సుగమమౌతుంది.