తెలంగాణలో సీపీఎంతోనే మా పొత్తు.. బీఆర్ఎస్ కు సీపీఐ షాక్!
posted on Feb 17, 2023 @ 4:17PM
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పొత్తులపై సీపీఐ క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ ఇచ్చిందని చెప్పడం కంటే.. అధికార బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అయితే తెలంగాణలో సీపీఎంతోనే మా పొత్తు అని కుండ బద్దలు కొట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో సీపీఐ, సీపీఎంలు కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఎశరినీ బతిమాలం, మాతో అవసరం ఉందనుకుంటే.. ఏ పార్టీ అయినా సరే మా దగ్గరకే రావాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఫలితాలను తారుమారు చేసే సత్తా, బలం మాపక్షాలకు ఉందన్న ఆయన రాష్ట్రంలో ఎవరు అధికారం చేపట్టాలన్న విషయాన్ని వామపక్షాలే నిర్ణయిస్తాయని అన్నారు.
అతి త్వరలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభల నిర్వాహణకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్‌తో కలిసిన వామపక్షాలు.. అప్పట్లో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. బీఆర్ఎస్ తో తమ మైత్రి కేవలం మునుగోడుకే పరిమితం కాదనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోనూ.. ఆ తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలోనూ కూడా బీఆర్ఎస్ తో మైత్రి పొత్తు కొనసాగుతుందని ప్రకటించిన సంగతి విదితమే.
అయితే ఇప్పుడు హఠాత్తుగా బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నట్లుగా ప్రకటనలు గుప్పించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. గత రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ తో వామపక్షాల మైత్రీ బంధం తెగిపోయిందన్న సంకేతాలు వస్తున్నా.. తాజాగా కూనంనేని ప్రకటనతో అది నిర్ధారణ అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. అయితే కూనంనేని సాంబశివరావు ప్రకటనపై బీఆర్ఎస్ నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు.