మారటోరియం చక్రవడ్డీ నుంచి రిలీఫ్..
posted on Mar 23, 2021 @ 2:30PM
కరోనా లాక్‌డౌన్‌తో రుణాలపై మారటోరియం విధించింది కేంద్రం. పేరుకే మారటోరియం పెట్టినా.. వడ్డీపై వడ్డీ లాగుతూ రుణగ్రహీతలపై భారం మోపాయి బ్యాంకులు. లోన్లపై చక్రవడ్డీ వద్దంటూ వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. కేసు సుప్రీంకోర్టును చేరింది. తాజాగా, మారటోరియం వడ్డీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. మారటోరియం కాలానికి రుణాలపై ఎలాంటి చక్రవడ్డీ విధించొద్దని ఆదేశించింది. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని కేంద్రం ఇప్పటికే మాఫీ చేసిందని కోర్టు గుర్తు చేసింది.
ఆర్థిక విధానాల్లో న్యాయపరమైన సమీక్ష చేపట్టలేమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. మారటోరియం కాలంలో చక్రవడ్డీని మాఫీ చేయాలని, మారటోరియంను పొడిగించాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. మారటోరియం కాలాన్ని పొడిగించడం, మొత్తం వడ్డీని మాఫీ చేయమని ఆదేశించడం సాధ్యం కాదని తెలిపింది. ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలు, ఉపశమనాలు ప్రకటించాలని కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ జారీ చేయలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా నష్టపోయిందని, అయినప్పటికీ కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయని గుర్తు చేసింది సుప్రీంకోర్టు.