చక్కెరకు బదులుగా షుగర్ ఫ్రీ ఉత్పత్తులు వాడితే అంతే సంగతులు!
posted on Oct 25, 2024 @ 9:30AM
ఇప్పట్లో అనారోగ్యాలు ఎక్కవ అవ్వడమే కాదు ఆరోగ్య స్పృహ కూడా ఎక్కవగానే ఉంది అందరిలో. చాలా మంది మధుమేహం, అధిక రక్తపోటు, ఉబకాయం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తగ్గట్టు ఆహారం దగ్గర నుండి అన్ని విషయాలలో మార్పులు చేసుకుంటున్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అవుతున్నామని అనుకుంటూ చాలామంది పొరపాట్లు చేస్తున్నారు. వాటిలో చక్కెరను నియంత్రించడం, దాని స్థానంలో కృత్రిమ చక్కెరలు ఉపయోగించడం ప్రధానమైనది. తీపిని ఇష్టపడని వారు ఉండరు. కానీ తీపి తింటే లావు అవుతామని, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని చాలామంది అనుకుంటారు. ఈ కారణంగా చాలామంది కృత్రిమ చక్కెరలు ఉపయోగిస్తుంటారు. దీన్ని వల్ల చక్కెరను నియంత్రించామని, ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటారు. పైపెచ్చు తీపి తిన్నామనే తృప్తి కూడా కలుగుతుంది. అయితే ఇలా కృత్రిమ చక్కెరలు తీసుకోవడం చాలా ప్రమాదమని తెలుస్తోంది. అసలు కృత్రిమ చక్కెరలు శరీరానికి ఎంత చేటు చేస్తాయి? దీని వల్ల కలిగే ప్రమాదాలేంటి తెలుసుకుంటే దీని నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
చక్కెరకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినవి కృత్రిమ చక్కెరలు. సాధారణంగా వీటిని డయాబెటిక్ రోగులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. చక్కెర తింటే లావు అవుతాం అనే అపోహ ఉన్నవారు కూడా దానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ చక్కెరలు ఉపయోగిస్తుంటారు. దీనివల్ల బరువు పెరగమని, ఆరోగ్యంగా ఉంటామని అనుకుంటారు. అయితే ఇది చాలా అవాస్తవం. సాధారణంగా కృత్రిమ చక్కెరలుగా అస్పర్టమే, సాచరిన్. సుక్రలోజ్, మాంక్ ప్రూట్, స్టెవియా, సార్చిటాల్, జిలిటాల్, ఎంథ్రిటాల్ వంటి పదార్థాలు ఉపయోగిస్తుంటారు. వీటిలో కూడా కృత్రిమ చక్కెరలను సాచరిన్ అనే పదార్థంతోనే ఎక్కువ తయారుచేస్తారు. ఇది చక్కెర కంటే తియ్యగా ఉంటుంది. తీపి తిన్న అనుభూతిని ఇస్తుంది. కానీ.. దీన్ని తీసుకోవడం వల్ల బరువు పెరగడం జరుగుతుంది. ఈ కారణంగా ఉబకాయం కూడా ఎదురవుతుంది.
ఇకపోతే ఈ కృత్రిమ చక్కెరలను అధికంగా తీసుకోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. ఫలితంగా ఆహారం తీసుకునే సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇది బరువును పెరగడానికి దారితీస్తుంది. అంతే కాదు ఎప్పుడైనా స్వీట్లలో అధికంగా కృత్రిమ చక్కెరలను వినియోగించడం వల్ల విరేచనం, వికారం, అపానవాయువు వంటి సమస్యలు ఏర్పడతాయి.
కృత్రిమ చక్కెరగా ఉపయోగించే అస్పర్థమే అధిక ఉష్ణోగ్రత వద్ద పార్మిక్ ఆమ్లంగా విచ్చిన్నమవుతుంది. స్వీట్ల తయారీలోనూ, కాఫీ, టీ లలోనూ వేడి మీద వీటిని జోడించడం ప్రమాదం. ఈ కారణంగా ఇది అలర్జీలకు కారణమవుతుంది. అలాగే అధికమొత్తంలో అస్పర్థమేను తీసుకోవడం వల్ల పెద్దలలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఒకటిన్నరెట్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలలో అయితే రొమ్ము క్యాన్సర్, ఉబకాయం చాలా సులువుగా వస్తాయి. ఫినైల్కెటోనూరియా అనే సమస్య ఉన్న వ్యక్తులు అస్పర్టమేకు దూరంగా ఉండాలి, వీరు అస్పర్టమేలో ఉండే ఫెనిలాలనైన్ అనే అమైనో ఆమ్లంను జీవక్రియ చేయలేరు. ఫెనిలాలనైన్ అధికంగా ఉండటం వల్ల మెదడులో మూర్ఛలు వస్తాయి.
ఇలా కృత్రిమ చక్కెరలు ఆరోగ్యానికి మంచి చేయకపోగా.. చెడు చేసే అవకాశమే ఎక్కువ.
*నిశ్శబ్ద.