ఈ పదార్థాలు ఆహారంలో భాగం చేసుకుంటే చాలు.. శరీరం ఉక్కులా మారుతుంది..
posted on Jul 29, 2023 @ 9:30AM
ఇప్పటి ప్రజలలో పోషకాహార లోపం చాలా ఎక్కువ. ఈ కారణంగా చాలామంది విటమిన్, ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటారు. అయితే ఈ సప్లిమెంట్ల వల్ల శరీరం తాత్కాలికంగా ధృఢంగా మారుతుందే తప్ప దీర్ఘకాల బలాన్ని ఇవ్వదు. అందుకోసం ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ ఖర్చుతో కూడుకున్నదని అందరూ అనుకుంటారు. కానీ అది చాలా తప్పు. అందరికీ అందుబాటులో లభించే ప్రోటీన్ ఫుడ్ లు ఉన్నాయి. వీటిలో నాలుగు గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ నాలుగు ప్రోటీన్ ఫుడ్స్ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరం ఉక్కులా మారుతుందని స్వయానా ఫిట్ నెస్ ట్రైనర్లే చెప్పడం గమనార్హం. ఇంతకూ శరీరానికి కావలసిన పోషకాలను సమృద్దిగా అందించే ఫుడ్స్ ఏంటో తెలుసుకుంటే..
కాయధాన్యాలు..
కాయధాన్యాలు ప్రోటీన్ కు మంచి మూలం. 50గ్రాముల నల్లశనగలు, సోయాబీన్, వేరుశనగలు తీసుకోవాలి. మరొకవైపు 50గ్రాముల పెసలు నానబెట్టుకోవాలి. ఇవన్నీ బాగా నానిన తరువాత వీటిని ఒక వస్త్రంలో వేసి మొలకలు తెప్పించాలి. ఈ మొలకలను అన్నింటినీ బాగా మిక్స్ చేసి మూడు నుండి నాలుగు భాగాలుగా విభజించుకోవాలి. వీటిలో రోజులో అప్పుడప్పుడు తినాలి. ఇలా చేస్తే శరీరానికి కావలసినంత బలం చేకూరుతుంది. ఇది శరీరాన్ని ఉక్కులాగా మార్చే పదార్థం కూడా.
పాలు, పెరుగు, జున్ను..
పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ లోపాన్ని నివారించడానికి 100 గ్రాముల వరకు జున్ను తీసుకోవచ్చు. లేకపోతే అరలీటర్ పాలు లేదంటే 400గ్రాముల పెరుగు తీసుకోవచ్చు. వీటి ద్వారా ప్రోటీన్ పుష్కలంగా లబిస్తుంది.
సోయా..
సోయా ఇప్పట్లో చాలా విరివిగా వాడుతున్నారు. సోయా గ్రాన్యుల్స్ నుండి సోయా చుంక్స్ అని సోయా పిండి అని సోయా నూడిల్స్ అని చాలా రకాలుగా ఉంటున్నాయి. అయితే శాఖాహారం తినేవారికి సోయాబీన్స్ సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది. ఇది ఒక్కటే ఎన్నో రకాల పోషకాలను భర్తీ చేస్తుంది. 60-80గ్రాముల సోయా బీన్ లో బోలెడు ప్రోటీన్ ఉంటుంది.
నట్స్.. పుట్టగొడుగులు..
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ మొదలైనవి నట్స్ లో పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఓ గుప్పెడు నట్స్ తిననవచ్చు. అలాగే 100గ్రాముల పుట్టగొడుగులు కూడా ప్రోటీన్ ను భర్తీ చేస్తాయి.
ఈ నాలుగు ఆహారాలు రోజులో తప్పకుండా ఎంతో కొంత తీసుకుంటూ ఉంటే పోషకాహార లోపం మీనుండి పరిగెత్తి వెళ్లిపోతుంది. శరీరం ఉక్కులా ధృఢంగా మారుతుంది.
*నిశ్శబ్ద.