స్వామి గారి కొత్త అంశం.. ఈ యాంగిల్ కూడా ఉందా..!
posted on Aug 27, 2016 @ 3:07PM
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు, లేకపోతే ఎవరో ఒకరి మీద కామెంట్లు చేసే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా మరో విషయంపై స్పందించారు. అయితే అది నెగిటివ్ గా కాదులెండి పాజిటివ్ గానే.. అబ్బో స్వామి గారిలో ఈ యాంగిల్ కూడా ఉందనుకుంటున్నారా.. అసలు సంగతేంటంటే.. ఈమధ్య కార్పొరేట్ సంస్థలు కూడా జీతభత్యాలు ఇవ్వలేక వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో 'ఆస్క్ మీ' కూడా చేరిపోయింది. అస్క్ మీ లో మేజర్ వాటాను కలిగిన మలేషియా సంస్థ చేతులెత్తేయడంతో ఉద్యోగులకు గత రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి. దీంతో ఉద్యోగులను తొలగించేందుకు చూస్తున్నారు.
ఇక దీనిపై స్పందించిన సుబ్రహ్మణ్యస్వామి.. ఈ విషయంపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తపన్ కు లేఖ రాశారు. ఉద్యోగుల వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరారు. ఇది భవిష్యత్తులో కోర్టు విచారణకు రానున్నందున ఈ విషయంలో అత్యవసర జోక్యం అవసరమని ఈ వ్యవహారాన్ని అత్యవసర కేసుగా పరిగణించాల్సిన అవసరముందని ఆయన హెచ్చరించారు. అంతేకాదు.. సంస్థ ను మూసివేయవద్దని కంపెనీ డైరెక్టర్లను కోరాలన్నారు. వేలమంది ఉద్యోగులను వదిలేయడం కాకుండా ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు. మలేషియా విదేశీ సంస్థ ఆస్ట్రో లిమిటెడ్ కు చెందిన 95శాతం వాటా కొనుగోలుకు సాయం చేయాలని రాశారు.