రేపు సర్వం బంద్..ఒక్కటైన శ్రామిక లోకం
posted on Feb 27, 2012 8:50AM
న్యూఢిల్లీ: దేశంలోని కార్మిక సంఘాలన్నీ ముక్త కంఠంతో మంగళవారం దేశ వ్యాప్త 'సార్వత్రిక సమ్మె'కు దిగుతున్నాయి. దీంతో.. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ రంగంలో నడిచే బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మంగళవారం ఒక్క రోజు పాటు మూతపడనున్నాయి. పోస్టల్ సర్వీసులు, పోర్టులు తదితర కీలక సర్వీసులూ సమ్మె బాట పట్టనున్నాయి. తమ హక్కుల సాధన కోసం ఏకంగా 10 కోట్ల మంది కార్మికులు ఒక్క రోజు సమ్మెకు దిగనుండటంతో.. దేశవ్యాప్తంగా వివిధ సంస్థల కార్యకలాపాలన్నీ మంగళవారం స్తంభించిపోనున్నాయి.
సరళీకరణ విధానాల నేపథ్యంలో కార్మిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా దేశంలోని కార్మిక సంఘాలన్నీ.. మంగళవారం దేశ వ్యాప్త 'సాధారణ సమ్మె'కు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ సహా వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ.. తమ తమ సైద్ధాంతిక విభేదాలను పక్కన పెట్టి ఇలా ముక్త కంఠంతో సమ్మెకు దిగడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి. ఒక్కటైన కార్మిక లోకం నిజానికి.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ సమ్మె విషయంలో ఐదు డిమాండ్లతో రూపొందించుకున్న చార్టర్ ప్రాతిపదికన ఒకే వేదిక మీదకు వచ్చాయి. కార్మిక చట్టాలన్నింటినీ కచ్చితంగా అమలు చేయడం, వీటిని ఉల్లంఘించే వారికి కఠిన శిక్షలు అమలు చేయడం, గుర్తింపు పొందని రంగాల్లో ఉన్న కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం, కార్మికుల కోసం జాతీయ భద్రతా నిధిని ఏర్పాటు చేయడం అన్నవి ఈ ఐదు డిమాండ్లు.
ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయడాన్ని నిలిపివేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక వివిధ బ్యాంకులకు చెందిన కార్మిక యూనియన్లు ఏడు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నాయి. కాగా.. సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని.. దీనిపై తాము చర్చలకు సిద్ధమన్న కేంద్రం ప్రతిపాదనను కార్మిక సంఘాలన్నీ తిరస్కరించాయి. మూడు నెలల కిందట తాము సమ్మెకు పిలుపునిస్తే.. ఇప్పుడు చర్చలకు పిలవడం హాస్యాస్పదమని కార్మిక నేతలు అన్నారు.
కాగా, ఈ బంద్ ప్రభుత్వాలకు హెచ్చరికలని వామపక్షాల నాయకులు అన్నారు. నిత్యావసరాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, వస్త్రాలపై వ్యాట్, విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనల నేపథ్యంలో ప్రజానీకం తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ప్రభుత్వానికి తమ నిరసనను వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. 28న సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా వామపక్షాల నగర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో మోటారు సైకిళ్లతో ప్రదర్శన జరిగింది. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ 28న జరిగే సమ్మెను, బంద్‌ను జయప్రదం చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలన్నారు. వివిధ తరగతుల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రకరకాల పన్నుల పేరుతో ప్రజల నడ్డివిరుస్తోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయటం ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.