గాడిలో పడుతున్న బందరు మున్సిపాల్టీ
posted on Feb 25, 2012 @ 3:46PM
మచిలీపట్నం: ఒకప్పుడు చెత్తా చెదారం, దోమలు అస్తవ్యస్త డ్రైనేజి వ్యవష్టకు మారుపేరుగా వున్న బందరు మున్సిపాల్టీ క్రమంగా గాడిలో పడుతోంది. బందరు మున్సిపల్ కమీషనర్ గా శివరామకృష్ణ నియమితులైన తరువాత బందరు ముఖచిత్రంలో అనేకమార్పులొచ్చాయి. రహదారులు క్లీన్ గా వుంటున్నాయి. మారుమూల ప్రాంతాల్లోసైతం రాత్రివేళల్లో విద్యుద్దీపాలు వెలుగుతున్నాయి. సిబ్బంది సకాలంలో జీత భత్యాలు పొందుతున్నారు. ఇప్పటికే అనేక సంస్కరణలు చేపట్టిన కమీషనర్ శివరామకృష్ణ త్వరలో మున్సిపల్ కార్యాలయంలో సిసి కెమెరాలు, బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటుచేసేందుకు సమాయత్తమయ్యారు. ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు గమనించేందుకు వివిధ విభాగాల్లో 13 సిసి కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఉద్యోగుల హాజరు, రాకపోకలను నమోదు చేసేందుకు బయోమెట్రిక్ సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నారు.
దేశంలోనే రెండవ మున్సిపాల్టీగా ఆవిర్భవించిన ఈ పురపాలక సంఘాన్ని మహామహులు పాలించారు. పేరు గొప్ప, ఊరు దిబ్బ చందంగా క్రమేపి ఈ పురపాలక సంఘం ప్రతిష్ట దిగజారింది. కమీషనర్లు, ఇతర విభాగాల అధికారుల ఇక్కడికి రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. నిధుల కొరత, ఉద్యోగుల క్రమశిక్షణా రాహిత్యం, రాజకీయ జోక్యం తదితర కారణాలవల్ల ఇక్కడ పనిచేయడానికి ఏ అధికారి ఇష్టపడేవారు కాదు. ఒక దశలో ఎసిబి, విజిలెన్స్ అధికారుల దాడులతో పురపాలక సంఘం ప్రతిష్ట వీధినపడింది. ఈ పరిస్థితుల్లో శివరామకృష్ణ కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించి, ఒక్కో విభాగాన్ని సంస్కరిస్తూ గాడి తప్పిన పాలనను ట్రాక్ లో పెట్టారు. రాత్రి వేళల్లో పారిశుధ్య పనులు చేపట్టడం, వీధి దీపాల నిర్వహణ మెరుగుపరచడం, తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవడం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం లాంటి చర్యలు ఒక ఎత్తయితే, ప్రజల విన్నపాలకు వెంటనే స్పందించడం మరో ఎత్తు. గతంలో ఒక అర్జి వస్తే పట్టించుకునే నాధుడే ఉండేవారు కాదు. ఒక దశలో పురపాలకసంఘ కార్యాలయం సైకిల్ స్టాండ్ గా మారింది. చుట్టు ప్రక్కలవారు వివిధ పనులమీద బందరు వచ్చినప్పుడు తమ సైకిళ్ళు, వాహనాలను పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో పెట్టి వెళ్ళిపోయేవారు. ఉద్యోగులు ప్రజలకెప్పుడూ కనిపించేవారు కాదు. ఈ స్థితినుంచి శివరామకృష్ణ బందరు మున్సిపాల్టీని అభివృద్ధి పధంలో నడుపుతున్నారు. మరికొంత కాలం ఆయన ఇక్కడే వుంటే తమ మున్సిపాల్టీ ఆదర్స మున్సిపాల్టీగా మారుతుందని ప్రజలంటున్నారు.