ఢిల్లీ టార్గెట్‌గా దొరల రాజకీయం!
posted on Mar 27, 2021 @ 2:32PM
తెలంగాణలో వెలమ రాజ్యం. దొర పాలనంటున్న ప్రతిపక్షం. తెలంగాణతో ఆగనంటున్నారు కేసీఆర్. ప్రధాని పీఠంపై బాణం గురిపెడుతున్నారు. ఎన్నికల ముందు హస్తిన బాట పడతానంటూ హడావుడి చేసిన గులాబీ బాస్.. ఆ తర్వాత ఎందుకో చల్లబడ్డారు. చాలా కాలం తర్వాత సడెన్‌గా మంత్రి మల్లారెడ్డి ఆ ముచ్చట మళ్లీ తీసుకొచ్చారు. కేసీఆర్‌ను ప్రధానిగా చూడాలంటూ.. అది తన కలంటూ.. అసెంబ్లీ సాక్షిగా తన మనసులో మాట వినిపించారు మల్లన్న.
మల్లారెడ్డి ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందనేది ఆసక్తికరం. ఆయనే అన్నారా? లేక, ఆయనతో పెద్దాయనే అనిపించారా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. కేసీఆర్ ఇషారా మేరకే మల్లారెడ్డి సభలో ప్రధాని ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని పదవి గురించి బహిరంగంగా మాట్లాడకపోయినా.. లోలోపల మాత్రం హస్తిన సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కేసీఆర్ కోసం ఆయన సామాజిక వర్గమంతా ఏకమై.. తమ వాడిని ఢిల్లీకి ప్రమోట్ చేయాలని మంత్రాంగం చేస్తున్నారట. వారు అనుకున్నది అనుకున్నట్టు వర్కవుట్ అయితే.. త్వరలోనే గులాబీ బాస్ ఎర్ర కోటపై కనిపించొచ్చని అంటున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో కేసీఆర్ కోసం ఓ రహస్య సమావేశం జరిగిందట. వెలమలంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారట. వెలమ వర్గానికి చెందిన అన్ని పార్టీలకు చెందిన పెద్ద స్థాయి నేతలు, బడా పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, బిలయనీర్లు అయిన కొంతమంది ఎన్నారైలు ఈ సీక్రెట్ మీటింగ్‌కు హాజరయ్యారని చెబుతున్నారు. ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో సెటిలైన వారు కూడా వచ్చారట. ఆ సమావేశం సారాంశమంతా ఒక్కటే. కేసీఆర్‌ను పీఎం చేయడమే. ఢిల్లీపై దండయాత్ర చేయాడానికి కావలసిన బలం, బలగంను ఎలా సమకూర్చాలో లెక్కలేశారట.
జనాభా పరంగా వెలమల సంఖ్య తక్కువే. వారిలో.. వెరీ వెరీ రిచ్ పీపుల్ ఎక్కువే. పాపులేషన్ తక్కువైనా పాపులారిటీ, పవర్, పైసాకు కొదవ లేదు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీలో వెలమ నేతలు కీలక స్థానంలో ఉన్నారు. ఇక, ఎన్నారైల గురించైతే చెప్పనవసరమే లేదు. దాదాపు ప్రతీ కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు ఫారిన్‌లో సెటిలైనవారే. ఇక, ఏ1 కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, పారిశ్రామిక వేత్తలకు కొదవే లేదు. ఇలా.. వెలమలంతా ఏకమై.. అంతా కలిసి ఆర్థిక వనరులు సర్దుబాటు చేసి.. కేసీఆర్‌ను ఢిల్లీ సింహాసనంపై కూర్చోబెట్టాలనేది వారి లక్ష్యం. అందుకు తగ్గట్టు కార్యచరణ సిద్ధం చేయడం కోసమే హైదరాబాద్‌లో ఆ రహస్య సమావేశం.
నాలుగైదు వేల కోట్ల వరకూ సద్దుబాటు చేసేలా సమావేశంలో చర్చలు జరిగాయట. వాటితో చిన్నా చితకా పార్టీలను, కొందరు ఎంపీలను మేనేజ్ చేసేలా సంప్రదింపులు జరిపే బాధ్యతను ఓ పారిశ్రామిక వేత్తకు అప్పగించారట. కేసీఆర్ ఢిల్లీ జర్నీకి కావలసిన సరంజామాను సమకూర్చేలా.. ఆ ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను ఎప్పటికప్పుడు సరి చేసేలా.. ఆయనకు అన్ని విధాల సహకరించారని నిర్ణాయానికొచ్చారు. వేరే పార్టీలో ఉన్న కీలక నేతలు సైతం తమ నాయకుడికి రూట్ క్లియర్ చేయాలని కుల పెద్దలంతా కలిసి ఓ అభిప్రాయానికి వచ్చారట.
ఆ మీటింగ్‌కు కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్లు హాజరుకాకపోయినా.. ఆయన సన్నిహితులే వెలమ కుల ప్రముఖుల సమావేశం ఏర్పాటు చేశారని చెబుతున్నారు. సమావేశం పూర్తయ్యాక.. సారాంశం కేసీఆర్‌కు బ్రీఫింగ్ చేశారట. అందుకు, గులాబీ బాస్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక స్లో..గా పని ప్రారంభించే పనిలో ఉన్నారు వెలమ వర్గీయులు. ఈ లోగా.. కేసీఆర్ ప్రధాని అనే డైలాగ్ ప్రజల్లో ఉండేలా.. దానిపై తరుచూ చర్చ జరిగేలా.. తమకు అనుకూలమైన వారితో ఆ ప్రస్తావన తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట. అయితే, ఆ నినాదం తమ సామాజిక వర్గ నాయకులు చేస్తే బాగుండదు కాబట్టి.. తెలంగాణలో అత్యంత బలమైన రెడ్డి నేతల నోటి నుంచే ఆ మాటను అనిపించారట. ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్లేలా.. అసెంబ్లీలో ఆ డైలాగ్ వినిపించడం యాదృచ్చికం కాదంటున్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే మంత్రి మల్లారెడ్డి.. కేసీఆర్‌ను పీఎంగా చూడాలని ఉందంటూ అసెంబ్లీలో అన్నారని అంటున్నారు. ఇదంతా.. ఆఫ్ ది రికార్డ్ మేటర్. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.