అహంకారంతో ఓడిన జానారెడ్డి!
posted on Mar 27, 2021 @ 2:03PM
కుందూరు జానారెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత సీనియర్ నేత. 43 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆయన మరోసారి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఆయనకు ఇది పదకొండవ సారి. 11 సార్లు జానారెడ్డి ఒక ప్రాంతం నుంచే పోటీ చేశారు. ఏడు సార్లు చలకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేయగా.. మూడు సార్లు చలకుర్తి నుంచి కొత్తగా ఏర్పడిన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేశారు. ఇప్పటివరకు జానా రెడ్డి ఏడు సార్లు గెలుపొందగా... మూడు సార్లు ఓడిపోయారు. త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ లో గెలిస్తే జానా రెడ్డి రికార్డ్ సాధించబోతున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలవబోతున్నారు.
1978లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు జానారెడ్డి. జనతా పార్టీ నుంచి తొలిసారి పోటీ చేసిన జానారెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మల రాములు చేతిలో ఓడిపోయారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో.. అన్నపార్టీలో చేరారు జానారెడ్డి. 1983లో టీడీపీ అభ్యర్థిగా చలకుర్తి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాదెండ్ల ఎపిసోడ్ తర్వాత ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేయడంతో 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ జానారెడ్డి గెలుపొందారు. తర్వాత ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1988లో ఎన్టీఆర్ ఒకేసారి 30 మంది మంత్రులను తొలగించారు. ఆ సమయంలో ఎన్టీఆర్ తో విభేదించి టీడీపీ నుంచి బయటికి వచ్చారు జానా రెడ్డి. తెలుగు మహానాడు పేరుతో సొంతంగా పార్టీ ప్రారంభించారు. అయితే కొంత కాలానికి అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ సమక్షంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు జానా రెడ్డి. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
రాజకీయ ఉద్దండుడైన జానారెడ్డికి 1994 అసెంబ్లీ ఎన్నిక మచ్చలా మిగిలిపోయింది. 1989-94 మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన జానా రెడ్డి..అహంకారంతో తీసుకున్న నిర్ణయం ఆయనను రోడ్డున పడేసిందని చెబుతారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో చలకుర్తి నుంచి మరోసారి పోటీ చేసిన జానారెడ్డి... తాను ప్రచారం చేయకుండానే గెలుస్తానని ప్రకటించారు. నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని, ప్రజలు తనను గెలిపించుకుంటారని తెలిపారు. జానారెడ్డి తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతి విశ్వాసానికి వెళుతున్నారని కొందరు, అహంకారంతో మాట్లాడుతున్నారని మరికొందరు కామెంట్లు చేశారు. ఓటర్లను అవమానిస్తున్నారని కూడా కొందరు విమర్శించారు. అయితే జానారెడ్డి మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ ఎన్నికల్లో ప్రచారం చేయలేదు. దీంతో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో చలకుర్తిలో టీడీపీ నుంచి పోటీ చేసిన రాంమ్మూర్తి యాదవ్.. జానా రెడ్డిపై విజయం సాధించారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాంమ్మూర్తి యాదవ్.. బలమైన నేతగా ఉన్న జానారెడ్డిని చలకుర్తిలో ఓడించడం అప్పట్లో పెను సంచలనమైంది.
1994 అసెంబ్లీ ఫలితంతో జానా రెడ్డికి షాక్ తగిలింది. ఓటమిని ఆయన జీర్ణించుకోలేకపోయారు. 1994లో టీడీపీ ప్రభంజనం వీచింది. ఎన్టీఆర్ సునామీలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా దెబ్బతిన్నది. కేవలం 24 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. దీంతో ఎన్టీఆర్ హవా వల్లే తాను ఓడిపోయానని కవరింగ్ ఇచ్చుకున్నారు జనా రెడ్డి. తర్వాత కసిగా పని చేసి నియోజకవర్గంలో మరింత బలపడ్డారు. 1999 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లోనూ అక్కడి నుంచే గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో చలకుర్తి నియోజకవర్గం నాగార్జునసాగర్ గా అవతరించింది. 2009, 2014లో నాగార్జున సాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. తెలంగాణ రాష్ట్రంలో 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో కేసీఆర్ హావా ఉన్నా గెలిచిన జానా రెడ్డి.. సీఎల్పీ లీడర్ గా పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నోముల నర్సింహయ్య చేతిలో 7 వేల 770 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఏడుసార్లు ఎమ్మెల్సేగా గెలిచిన జానా రెడ్డి.. మంత్రిగానూ పలు రికార్డులు సాధించారు. ఎక్కువ కాలం మంత్రిగా పని చేసిన వ్యక్తిగా కాసు బ్రహ్మనందా రెడ్డి రికార్డును అధిగమించారు. మంత్రిగా హోంశాఖ, వ్యవసాయ శాఖ, సహకార, మార్కెటింగ్, ఫారెస్ట్, పశు సంవర్థక శాఖ, మత్స్య శాఖ, తూనికలు- కొలతల శాఖ, రవాణా, రోడ్లు- భవనాలు, హౌసింగ్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలోనూ కీలక పదవులు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేసులోనూ నిలిచారు. అత్యంత సీనియర్ నేత జానారెడ్డి.. నాగార్జుసాగర్ లో ఈసారి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తన సొంత గడ్డలో పట్టు నిలుపుకోవాలని ఆరాటపడుతున్నారు. జానారెడ్డి గెలిస్తే.. రికార్డు అవుతుందనే చర్చ కూడా నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అయితే నియజకవర్గ ఓటర్లు జానా రెడ్డిని ఆదిరిస్తారో లేదో చూడాలి మరీ..