మనిషి డబ్బు విషయంలో ఎలా  ఉండాలంటే..

 

 ధనం మూలం ఇదం జగత్.. అని ఓ గొప్ప మాట చెప్పారు. ఈ ప్రపంచం ధనంతోనే నడుస్తోందన్నది ఆ మాటకు అర్థం. ధనమేరా అన్నిటికీ మూలం.. ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అని ఓ పాట కూడా ఉంది. డబ్బు విలువ తెలుసుకోవడం మనిషి ధర్మం అన్నది  ఆ పాట వాక్యాలలో అర్థం. ప్రస్తుతకాలంలో మనిషి జీవితాన్ని డబ్బు ఎంతగా ప్రభావితం చేస్తోందో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న మొత్తానికే దారుణాలకు పాల్పడుతున్నవారు ఉన్నారు. డబ్బు సులువుగా సంపాదించడానికి టెక్నాలజీని  ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు రాజ్యాల కోసం తోడబుట్టినవారిని రాజులు బలితీసుకుంటే ఇప్పటికాలంలో ఆస్తుల కోసం, పదవులకోసం రక్తం పంచుకుపుట్టిన వారి ప్రాణాలనే తీస్తున్నారు. మొత్తానికి డబ్బు ఈ ప్రపంచాన్ని ఆడిస్తోందన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మనిషి చేతిలోనే రూపొందిన డబ్బు మనిషినే శాసించడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అందుకే మనిషి డబ్బు గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. డబ్బు విషయంలో మనిషి ఎలా ఉండాలో  నిర్ణయించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

డబ్బు అవసరం..

ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరమే. చేతిలో రూపాయి లేకుండా ఎక్కడా బ్రతకలేడు నేటికాలం మనిషి. కష్టపడటం, సంపాదించుకోవడం, చదువులు, జీవనం, ఆహారం,  వసతి.. ఇలా అన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి డబ్బుకు విలువ ఇవ్వడం మంచిదే. మనిషి డబ్బుకు ఇచ్చే విలువ అంతా తను సంపాదించే విధానంలోనే ఉంటుందని కొందరు అంటారు. కష్టపడి సంపాదించే వాడు ఒక్క రూపాయి వృధాగా ఖర్చు చేయాలన్నా చాలా బాధపడతాడు. ఒక్క  రూపాయి ఇతరుల చేతిలో మోసపోయినా తనను తాను సంభాళించుకోలేడు.  అయితే కష్టానికి. డబ్బుకు మధ్య ఉన్న కోణాన్ని వదిలేస్తే డబ్బును  కేవలం అవసరమైన వస్తువుగా చూడటం వల్ల అది మనిషి మీద చూపించే ప్రభావం కూడా తగ్గుతుంది. అందుకే బ్రతకడం కోసం డబ్బు సంపాదించుకోవాలి అంతే కానీ డబ్బు కోసమే బ్రతకకూడదు అని అన్నారు విజ్ఞులు.

ఈజీ మనీ..

ఈ కాలంలో చాలామంది కుర్రాళ్లు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. కష్టపడకుండా ఇతరుల సొమ్మును సులువుగా చేజిక్కించుకోవడం, దానితో జల్సా జీవితాలు గడపడం ఎక్కువైపోయింది. కానీ ఇలాంటి మార్గాలలో వచ్చే సొమ్ము దీర్ఘకాలం జీవితాలను నిలబెట్టదనే విషయం తెలుసుకోవాలి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి పనులు చేస్తున్నారని తెలిసినా వారి మీద ఉన్న ప్రేమ కొద్దీ వారిని ఏమీ అనకుండా నిమ్మకు నీరెత్తినట్టు  ఉంటారు. ఇలాంటి వారు చేజేతులా తమ పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని గ్రహించాలి.


ప్రాధాన్యత..

డబ్బుకు గుణం అంటూ ఏమీ లేదు. దాన్ని మనిషి ఎలా   ఉపయోగిస్తే అది దానికి అనుగుణమైన ఫలితాలను మనిషికి అంటిస్తుంది. మంచి, చెడు, కోపం, అసూయ, ద్వేషం.. ఇలా పాజిటివ్.. నెగిటివ్ గుణాలను డబ్బు మనిషిలో నింపుతుంది. అందుకే డబ్బును తటస్థ వస్తువుగా చూడాలి. దాన్ని  ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అలా వాడాలి తప్ప డబ్బే పరమావధిగా  ఎప్పుడూ బ్రతకకూడదు. డబ్బు మనిషికి అవసరమైనదే అయినా దానికోసం అస్తమానూ ఆరాటపడే మనిషికి జీవితంలో సుఖం అనేది ఎప్పటికీ దక్కదు. అందుకే డబ్బును దానిలాగే చూడాలి. మనుషులతో కంపేర్ చేయకూడదు.

                             
                                               నిశ్శబ్ద.