Read more!

జ‌గ‌న్‌పై రాయితో దాడి.. ప‌క్కా ప్లానింగ్‌తోనే జ‌రిగిందా?

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తి రాయితో దాడి చేశాడు. బ‌స్సు యాత్రలో భాగంగా విజ‌య‌వాడ న‌గ‌ర్ దాబా కోట్ల సెంట‌ర్ లో శ‌నివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పూలతోపాటు రాయి కూడా విస‌ర‌డంతో  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. దీంతో, వైద్యులు ఆయ‌న‌కు బస్సులోనే చికిత్స అందించారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. కొద్దిసేప‌టికి, వైద్యుల స‌ల‌హామేర‌కు సీఎం జ‌గ‌న్ చికిత్స‌ కోసం విజ‌య‌వాడ కేస‌ర‌ప‌ల్లి క్యాంప్ నుంచి  ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి  వెళ్లారు. గాయానికి రెండు కుట్లు ప‌డ్డాయ‌ని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంత‌రం సీఎం జ‌గ‌న్ తిరిగి కేస‌ర‌ప‌ల్లికి బ‌య‌లుదేరి వెళ్లారు. సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోపాటు ఆయ‌న స‌తీమ‌ణి భార‌తీ కూడా ఉన్నారు. సీఎం జ‌గ‌న్ పై దాడిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. సీఎం జ‌గ‌న్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నానంటూ పేర్కొన్నారు. ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు సైతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడిని ఖండించారు. దాడి ఘ‌ట‌న‌పై నిష్పాక్షిక‌ విచార‌ణ జ‌రిపించాల‌ని ఎన్నిక‌ల సంఘానికి చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేశారు. దాడికి పాల్ప‌డిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పై కూడా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ఈసీకి విజ్ఞ‌ప్తి చేశారు.సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న‌ను అంద‌రూ ఖండించాల్సిన విష‌యమే. జ‌గ‌న్‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్, ష‌ర్మిల ఇలా ఏ పార్టీ నేత‌పై ఇలాంటి దాడులు జ‌రిగినా ఎవ‌రూ స‌మ‌ర్ధించ‌రు. 

కానీ, జ‌గ‌న్‌పై రాయి దాడి ఘ‌ట‌నపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్‌పై రాయిదాడి  జ‌రిగిన క్ష‌ణాల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియాలో సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ నేత‌ల రాళ్ల‌దాడి అంటూ విస్తృత ప్ర‌చారం చేశారు. అంతే కాదు  వైసీపీ నేత‌లుకూడా చంద్ర‌బాబు కుట్ర‌లో భాగంగానే జ‌గ‌న్‌పై దాడి జ‌రిగింద‌ని ప్ర‌చారం చేశారు. మొత్తానికి జ‌గ‌న్‌పై రాయి దాడిని రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నం చేశారు. రాయిదాడి చేసింది ఎవ‌రో నిర్దార‌ణ కాక‌ముందే.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేత‌లంతా మీడియా మైకుల ముందుకొచ్చి చంద్ర‌బాబే దాడి చేయించారని మాట్లాడ‌టం చూస్తే ఇదంతా ముంద‌స్తు  ప్లాన్ ప్రకారమే జరిగిందా అన్న  అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు  సీఎంపై రాయి దాడి ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో విద్యుత్ స‌ర‌ఫ‌రా లేక‌పోవ‌టం, ఆ ప్రాంత‌మంతా చీక‌టిగా ఉండ‌టం  కూడా ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.  విద్యుత్ స‌ర‌ఫ‌రాను అధికారులే నిలిపివేశార‌ని స‌మాచారం. జ‌గ‌న్ బ‌స్సుపై ఎక్కి ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బ‌స్సుయాత్ర ప్రాంతంలో విద్యుత్ వైర్లు కిందికి ఉండ‌టంతో  సీఎం జ‌గ‌న్ కు ఇబ్బంది త‌లెత్త‌కుండా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేసిన‌ట్లు అధికారులు తెలిపిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు  క‌చ్చితంగా విద్యుత్ స‌ర‌ఫ‌రా తీసేసిన స‌మ‌యంలోనే జ‌గ‌న్‌పై దాడి జ‌ర‌గ‌డం ప‌ట్ల‌ కూడా టీడీపీ నేత‌లు   అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

 జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న ప‌ట్ల‌ సోష‌ల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఎన్నిక‌లొచ్చాయి.. జ‌గ‌న‌న్న మ‌ళ్లీ మొద‌లు పెట్టాడ్రోయ్‌.. అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తుండ‌గా.. ప్ర‌జ‌ల సానుభూతి కోసం గ‌తంలో కోడిక‌త్తి.. ఇప్పుడు రాయి దాడి   అంటూ మ‌రికొంద‌రు జోకులేస్తున్నారు.   ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్‌పై దాడులు జ‌ర‌గ‌డం కామ‌న్ అనే విష‌యం ఏపీ ప్ర‌జ‌ల‌కు కూడా అర్ద‌మైపోయిందని అంటున్నారు.  2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోడి క‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతి  పొంది అధికారంలోకి వ‌చ్చారు. అంతేకాదు.. త‌న సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌ను చంద్ర‌బాబుపై నెట్టి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డంలో జ‌గ‌న్ విజ‌య‌వంతం అయ్యాడు. అధికారంలో కొన‌సాగిన‌న్ని రోజులు క‌క్ష‌పూరిత రాజ‌కీయ‌ల‌తో రాష్ట్రాభివృద్ధిని జ‌గ‌న్ ప‌క్క‌కు పెట్టేశారు. దీంతో ఏపీ ప్ర‌జ‌లకు క‌నీస సౌక‌ర్యాలుకూడా క‌రువ‌య్యాయి. అన్ని విభాగాల్లోనూ వైసీపీ నేత‌ల దోపిడీ తార స్థాయికి చేరింది. దీంతో ప్ర‌జ‌లు జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ క‌క్ష‌ పూరిత‌ పాల‌న ప‌ట్ల‌ విసిగిపోయిన ప్ర‌జ‌లు..   తెలుగుదేశం కూట‌మి వైపు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డిన‌ నాటినుంచి వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి  భారీగా వలసలు జరుగుతున్నాయి. దీనికితోడు జ‌గ‌న్ చేప‌ట్టిన మేమంతా సిద్ధం బ‌స్సు యాత్ర‌కు ఆద‌ర‌ణ ల‌భించ‌డం లేదు. దీంతో.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోలా కోడికత్తి దాడిలా జ‌గ‌న్ ఈసారి కూడా రాయి దాడి ఘ‌ట‌న‌ను ప్లాన్ చేసిన‌ట్లు తెలుగుదేశం నేత‌లు ఆరోపిస్తున్నారు. రాయి దాడి ఘ‌ట‌న ప‌ట్ల పూర్తి విచార‌ణ జ‌రిపించాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ను వారు  కోరుతున్నారు. 

జ‌గ‌న్‌కు త‌గిలిన గాయం చిన్నదే. రెండు కుట్లు పడ్డాయి. దీనిని హత్యాయత్నంగా జగన్ అనుకూల మీడియా అభివర్ణిస్తోంది. మరోవైపు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దాడి ఘ‌ట‌న‌ను వైసీపీ నేత‌లు రాజ‌కీయంగా వాడుకునేందుకు విశ్వ‌ప్ర‌ య‌త్నాలు చేస్తున్నారు.

  రాయిదాడి ఘ‌ట‌న‌ను ఎన్నిక‌ల క‌మిష‌న్ సీరియ‌స్ గా తీసుకొని విచార‌ణ జ‌రిపించాల‌ని, నిజానిజాల‌ను నిగ్గుతేల్చి నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగుదేశం నేతలు కోరుతున్నారు. పథకం ప్రకారం సొంత మనుషుల చేతే దాడి చేయించుకుని ఆ దాడికి కారకులుగా విపక్ష నేతలను చూపి రాజకీయ లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బందోబ‌స్తు నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌పైకూడా ఈసీ దృష్టి సారించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలుగుదేశం నేత‌లు కోరుతున్నారు.

ఇక పరిశీలకులు సైతం ఈ దాడి గత ఎన్నికల ముందు జరిగిన కోడి కత్తి దాడిని స్ఫురింప చేసేలాగే ఉందని విశ్లేషిస్తున్నారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే దానిని రాజకీయం చేయడానికి వైసీపీ నేతలు రంగంలోకి దిగిపోవడం, చంద్రబాబు ప్రమేయం అంటూ విమర్శలు గుప్పించడం చూస్తుంటే కోడికత్తి ఘటనే గుర్తుకు వస్తున్నదని అంటు న్నాయి. అయినా ఇన్ని రోజులుగా జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రను గమనిస్తున్న వారికి ఆయన విజయవాడలో మాత్రమే  చీకటి పడిన తరువాత కూడా, అదీ కరెంటు లేకపోయినా కూడా బస్సులోపలికి వెళ్లకుండా ప్రజలకు అభివాదం చేస్తూ ఎందుకు ఉన్నారన్న సందేహం కలగక మానదు. ఎందుకంటే అలా చీకటి పడిందో లేదో అలా జగన్  బస్సులోపలికి వెళ్లిపోవడం ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచీ జరుగుతోంది. ఒక్క విజయవాడ సింగ్ నగర్ దాబా కోట్ల సెంట‌ర్ వద్ద మాత్రం ఆయన చీకటి పడినా, కరెంటు లేకపోయినా.. రాయి వచ్చి ఆయనకు తగిలే వరకూ బస్సులోకి వెళ్లకుండా నిలుచున్నారు. ఇదే  సానుభూతి పొందేం దుకు ప్రణాళికా బద్ధంగా చేయించుకున్న దాడి అన్న అనుమానాలను రేకెత్తిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక జగన్ సెక్యూరిటీ సిబ్బందికి కూడా దాడి సంగతి తెలుసా అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే జగన్ బస్సుపై నిలుచుని ప్రజలకు అభివాదం చేస్తుంటే ఆయనకు అటూ ఇటూ నిలబడి అప్రమత్తంగా ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది మాత్రం తాపీగా కింద కూర్చున్నారు. అన్నిటికీ మించి ఇలా జగన్ పై రాయి దాడి జరిగిందో లేదో అందుకు సంబంధించిన విజువల్స్ తో అలా  వైసీపీ సోషల్ మీడియాలో సింపతీ డ్రామాలు ఆరం భమైపోయాయి.    చంద్రబాబే రాయి వేయించాడని  ఆరోపణలు ఆరంభమైపోయాయి.  మొత్తం మీద సామాన్య జనం కూడా జగన్ పై జరిగిన దాడిపై సెటైర్లు వేస్తున్నారు. కోడికత్తి సీన్ కు కొంచం అటూ ఇటూగా రిపీట్ చేశారు. ఇప్పుడు బాబాయ్ హత్య వంటి మరో సీన్ కోసం ప్లానింగ్ జరుగుతోందా అంటూ   నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.