చిత్తూరుజిల్లాలో రూ.32 కోట్ల నిధుల స్వాహాకు రంగం సిద్దం
posted on Feb 24, 2012 @ 9:55AM
హైదరాబాద్: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (విఆర్ జి ఎఫ్) పనుల పంపకాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఈ పధకం కింద రూ.32 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు కాంట్రాక్టర్లకు కట్టబెట్టి పర్సంటేజీలు పుచ్చుకునేందుకు అధికార, ప్రతిపక్ష నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నేతలు చేస్తున్న ఒత్తిడి అధికారులకు తలనొప్పిగా మారింది. జిల్లాలోని పుత్తూరు, శ్రీకాళహస్తి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, మదనపల్లె పరిధిలో కొందఱు అధికార ప్రతిపక్ష నేతలు 20 నుంచి 30శాతం వరకు పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ పధకం కింద గ్రామాల్లో మంచినీటి సరఫరా, పైపులైన్ల ఏర్పాటు, మురికి కాల్వలు, కొత్త భవనాలు, అసంపూర్తి భవనాలు, పాఠశాలల్లో ప్రహరి గోడల నిర్మాణం, సిమెంటు రోడ్లు, అంగన్ వాడీ సెంటర్లు వంటివి నిర్మించాల్సి ఉంటుంది. గ్రామ సభల్లో తీర్మానాలు చేసి ఈ పనులు కేటాయించాలి. అయితే ఎక్కడా గ్రామ సభలు నిర్వహించిన దాఖలాలే లేవు. ఎమ్మెల్యేలు స్థానిక నేతల కనుసన్నల్లో పనులు గుర్తించి వాటిని ఎవరికి అప్పజెప్పాలో నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రజాప్రతినిధులు కోరుతున్నంత పర్సంటేజి ఇవ్వలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నట్లు సమాచారం. నివేదికలు సిద్డంకాక ముందే పర్సంటేజీల విషయంలో నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు గొడవలకు దిగుతుండటం గమనార్హం.