టిజి వెంకటేష్ పై నిప్పులు చెరుగుతున్న సమైక్యవాదులు
posted on Apr 23, 2012 @ 11:02AM
రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖామంత్రి టిజి వెంకటేష్ పై రాయలసీమలోని సమైక్యవాదులు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణా వాదం స్థబ్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రవిభజనపై ఆయన తరచుగా ఏదో ఒక ప్రకటన చేస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. కొంతకాలం క్రితం వరకూ తాను కరుడుగట్టిన సమైక్యవాదినని టిజి వెంకటేష్ ప్రకటించుకున్నారు. కానీ, ఇటీవల ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తప్పని పరిస్థితుల్లో సీమాంధ్ర, గ్రేటర్ రాయలసీమ లేదా రాయలతెలంగాణా డిమాండు చేస్తానని చెప్పారు. ఈ ప్రకటన రాయలసీమలోని సమైక్యవాదులకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అసలు రాయల తెలంగాణా అనే నినాదమే తప్పని సమైక్యవాదు లంటున్నారు. తెలంగాణావాదులు రాయలసీమ వాసులను భూకబ్జాదారులుగా, ఫ్యాక్షనిస్టులుగా అభివర్ణిస్తున్నారని, అటువంటి వారితో ఎలా కలిసి ఉండగలమని వారు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి టిజి వెంకటేష్ కూడా అనేక సందర్భాల్లో తెలంగాణా నాయకులను, తెలంగాణా సంస్కృతిని కూడా కించపరుస్తూ మాట్లాడారు. అటువంటి వ్యక్తి నేడు రాయలతెలంగాణా ఏర్పాటుకు సానుకూలంగా మాట్లాడటం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికే చెందిన జెసి దివాకర్ రెడ్డి కూడా రాయల తెలంగాణా కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే రాయలసీమను తెలంగాణలో చేర్చుకునే ప్రసక్తే లేదని టి.ఆర్.ఎస్. నాయకులు అంటున్నారు.