బాలినేనికి మాజీ కౌన్సిలర్ల షాక్
posted on Apr 23, 2012 @ 11:04AM
ఒంగోలు శాసనసభ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డికి షాక్ మీద షాక్ ఇస్తున్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలోని మాజీ కౌన్సిలర్లను, ఆ పార్టీల్లోని ద్వితీయ, తృతీయశ్రేణి నాయకులను బాలినేని మచ్చిక చేసుకోవాలనుకుంటున్నారు. దీనిలో భాగంగా ఆయన వారితో మంతనాలు జరుపుతున్నారు. అయితే ఆ నాయకుల డిమాండ్లు వింటూ ఉంటే బాలినేనికి దడపుడుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 10అంది మాజీ కౌన్సిలర్లు తమ మద్దతును బాలినేనికి ఇవ్వాలంటే ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున ముందుగా ఇవ్వాలని షరతుపెట్టినట్లు తెలిసింది. ఈ షరతుల విషయం బయటకు పొక్కడంతో మిగిలిన నాయకులు కూడా తమకు కూడా తృణమో ఫణమో ముందుగా ఇస్తే తప్ప బాలినేని పంచన చేరబోమని స్పష్టం చేస్తున్నారు. అయితే వీరందరి డిమాండ్లను తీర్చాలంటే తనకు నాలుగుకోట్లు ఖర్చు అవుతుందని, దాని బదులు ఎన్నికల సమయంలో ఆ డబ్బును ఓటర్లకు ఖర్చు చేస్తే మంచిదన్న నిర్ణయానికి బాలినేని వచ్చారని తెలిసింది. బాలినేని వరుసగా మూడుసార్లు గెలిచినప్పటికీ ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఆయన ఎదుర్కోలేదు.