ఇసుక అక్రమ రవాణాలో రూ. 140 కోట్లు ఆర్జించిన మాజీమంత్రి
posted on Apr 23, 2012 @ 10:58AM
కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన మద్యం సిండికేట్లు ఇప్పుడు ఎసిబి దాడులతో విలవిలలాడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటోంది. అయితే ఇసుకమాఫియాను రాష్ట్రప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి రాష్ట్రంలోని ఇసుకమాఫియా గత పదేళ్లుగా రాష్ట్రాన్ని విచ్చలవిడిగా దోచుకుంది. దీని దోపిడీకి తాజా నిదర్శనం వరంగల్ జిల్లాలో జరిగిన అక్రమవ్యాపారమే. వరంగల్ జిల్లాకు చెందిన ఒక మాజీమంత్రి కేవలం పదినెలల వ్యవధిలో ఇసుక అక్రమరవాణా వ్యాపారంలో సుమారు 140కోట్ల రూపాయలు ఆర్జించారు.
రాష్ట్రంలో పేరుమోసిన మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో కీలకనేతగా ఉన్నారు. ఇతను 2011 ఏప్రిల్ 27న ఇసుక వ్యాపారాన్ని ప్రారంభించి మార్చి నెలాఖరు నాటికి రూ.140 కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. ఆయన బినామీ పేర్లతో రొయ్యూరు, మాస్పురు శివార్లలో ర్యాంప్ లు లీజుకు తీసుకుని ఈ వ్యాపారం ప్రారంభించారు. ఈయన ఈ ర్యాంప్ ల నుంచి రోజుకు 200 లారీల ఇసుకను వరంగల్, హైదరాబాద్ నగరాలకు పదినెలల పాటు నిర్విరామంగా తరలించారు. లారీకి పది టన్నుల ఇసుకను తీసుకువెళ్ళాల్సి ఉండగా 15 టన్నుల చొప్పున అక్రమంగా తరలించారు. ర్యాంప్ వద్ద నుంచి ఇసుకను తరలించే లారీకి రూ. 3,500 నుంచి 4వేల రూపాయల దాకా చెల్లించారు.
ఇదే ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి లారీకి రూ. 14వేల రూపాయలు చొప్పున వసూలు చేశారు. ఈ లెక్కన ఆయన నెలకు పదికోట్ల 40లక్షల రూపాయలు, పదినేలలకు రూ. 140 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న ర్యాంపుల నుంచే ఇంత పెద్దేత్తున వ్యాపారం సాగితే ఇక గోదావరి నదిలోని ర్యాంపుల వద్ద ఎంత పెద్దేత్తున ఇసుక వ్యాపారం జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ ఇసుక వ్యాపారంలో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ మాజీ మంత్రిగారు రూ. 140కోట్లు ఆర్జించినప్పటికీ ఇసుక ర్యాంపు లను వేలంలో కొనుక్కున యజమానికి ఇచ్చింది కేవలం నాలుగుకోట్ల రూపాయలు మాత్రమేనని తెలుస్తోంది.