క్లాస్ రూంలో టీచర్ పై ఆరేళ్ల విద్యార్థి కాల్పులు..
posted on Jan 7, 2023 @ 2:45PM
అమెరికాలో గన్ కల్చర్ వెర్రి తలలు వేస్తోంది. పెద్దా చిన్నా తేడా లేకుండా అందరికీ గన్స్ అందుబాటులోకి ఎలా వస్తున్నాయో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ ఆరేళ్ల బాలుడు కాల్పులకు తెగబడిన సంఘటన తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, అమెరికాలో నెలకొన్న ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఓ ఆరేళ్ల బాలుడు తన టీచర్ లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డాడు. అదీ తరగతి గదిలోనే. కారణాల గురించి ఆరా ఎందుకు కానీ.. వర్జీనియాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతున్న ఓ ఆరేళ్ల విద్యార్థి తన టీచర్ పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
తన స్కూల్ బ్యాగ్ లో గన్ పెట్టుకుని వచ్చిన ఆ ఆరేళ్ల కుర్రోడు.. తరగతి గదులోనే టీచర్ పై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పులలో టీచర్ వినా మరెవరూ గాయపడకపోవడంతో ఆ బాలుడి టార్గెట్ టీచరేనని నిర్ధారణకు వచ్చారు.
కాల్పులకు తెగబడిన విద్యార్థి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అమెరికాలో గన్ కల్చర్ కొత్తేమీ కాదు కానీ, ఇంత చిన్న పిల్లాడు కాల్పులకు తెగబడిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.