కామన్ వెల్త్ క్రీడలలో పాల్గొనేందుకు వెళ్లిన లంక క్రీడాకారులు మిస్సింగ్
posted on Aug 8, 2022 @ 11:00AM
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక క్రీడాకారులు అదృశ్యమయ్యారు. కామన్ వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి 160 మంది క్రీడాకారుల బృందం బర్మింగ్ హాం వెళ్లంది. అయితే ఆ బృందంలోని పది మంది క్రీడాకారులు అదృశ్యమయ్యారు.
ఈ పది మంది పాల్గొనే ఈవెంట్లు పూర్తి కాగానే తొమ్మిది మంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ అదృశ్య మయ్యారు. వీరు గత వారం రోజులుగా కనిపించడం లేదు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి వెల్లడించారు. క్రీడాకారుల అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రీడాకారుల కోసం గాలించగా తొలుత అదృశ్యమైన ముగ్గురు.. జుడోకా చమీలా దిలాని, ఆమె మేనేజర్ అసేల డి సిల్వా, రెజ్లర్ షనిత చతురంగలను గుర్తించారు. అయితే వారు ముగ్గురూ కూడా స్థానిక చట్టాలను వారు ఉల్లంఘించలేదని పోలీసలు పేర్కొన్నారు.
కనుక ఆ ముగ్గురిపై ఎలాంటి చర్యలూ తీసుకోబోవడం లేదని అన్నారు. అయితే అదృశ్యమైన పది మందిలో ముగ్గురి ఆచూకీ మాత్రమే ఇప్పటి వరకూ లభించింది. మిగిలిన ఏడుగురి కోసమూ గాలిస్తున్నారు.