జాబిల్లిపై మానవుడి అడుగుజాడను నాడే స్వప్నించిన శ్రీశ్రీ
posted on Aug 24, 2023 @ 1:59PM
రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది అన్నాడో సినీ కవి.. కానీ ప్రజా కవి, మహాకవి శ్రీశ్రీ మాత్రం నేడు నెరవేరిన కలని ఎప్పుడో ఆరు దశాబ్దాల కిందటే కని అక్షర బద్ధం చేశారు.
జాబిల్లిపై భారత్ జయపతాక ఎగురవేసింది. చంద్రయాన్ 3 ద్వారా చందమామపై విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ యావత్ దేశం గర్వించదగ్గ మహోజ్వల ఘట్టం. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి యువతకు పిలుపునిచ్చారు. చంద్రుడిమీద కాలూనాలన్న కలను మహాకవి శ్రీశ్రీ దశాబ్దాల కిందటే కన్నారు. కని ఊరుకోకుండా దానిని కవిత్వీకరించి భవిష్యత్ తరాలకు స్ఫూర్తి గీతికగా మార్చారు. నేడు ఇస్రో సాధించిన అద్భుత విజయాన్ని ఆయన ఎప్పుడో తన మానవుడి ప్రొగ్రెస్ రిపోర్ట్ కవితలో చూపించేశారు. దాదాపు ఆరు దశాబ్దాల కిందటే మహాకవి శ్రీశ్రీ తన ఖడ్గ సృష్టి సంకలనంలో ని మానవుడి ప్రోగ్రస్ రిపోర్ట్ అన్న కవితలో
మబ్బుతునక జేబురుమాలు
మాటు చేసుకున్న జాబిల్లీ !
ఏమో బహుశా త్వరలో
నీ ఇంటికి రావొచ్చు మేము
స్వాగతం ఇస్తావు కదూ !
ఆతిధ్యానికర్హులమే మేము !
చంద్ర మండలానికి ప్రయాణం
సాధించరాని స్వప్నం కాదు
గాలికన్నా బరువైన వస్తువుని
నేల మీద పడకుండా నిలబెట్ట లేదూ ?
పరమాణువు గర్భంలోని
పరమ రహస్యాలు
మహాకాశ వాతావరణంలోని
మర్మాలు తెలుసుకున్నాక
సరాసరి నీదగ్గరకే ఖరారుగా వస్తాంలే
అపుడు మా రాయబారుల్ని
ఆదరిస్తావు కదూ నువ్వు ? అంటూ రాశారు. ఆయన నాడు ఊహించి, ఆశించిన మహోజ్వల ఘట్టం నేడు ఇస్రో సాకారం చేసింది.