కరెంట్ కోతలతో జనం ఉక్కిరిబిక్కిరి.. చేతులెత్తేసిన జగన్ సర్కార్
posted on Aug 24, 2023 @ 4:51PM
ముఖ్యమంత్రి అంటే కుటుంబం లాంటి రాష్ట్రానికి ఇంటి పెద్ద. కుటుంబ సభ్యుల అవసరాలేంటి? వారికి ఉపాధి ఎలా? ఆదాయాన్ని మదింపు చేసి అవసరానికి వాడుకోవడం ఎలా? అత్యవసరాల పరిస్థితి నుండి బయటపడడం ఎలా? ఇలాంటి అంశాలన్నీ ముందుగానే అలోచించి ఒక కంట కనిపెట్టి తీర్చాల్సిన బాధ్యత కుటుంబ పెద్దపై ఉంటుంది. సీఎం కూడా అంతే. రాష్ట్ర ప్రజల సంక్షేమం ఏంటి? వారికి కావలసిన కనీస సౌకర్యాల కల్పనకు తీసుకోవలసిన చర్యలు ఏంటి? ప్రజలకు విద్యా, ఉపాధి ఎలా? రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించడం ఎలా? విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం ఎలా? ప్రకృతి వైపరీత్యాలను అధిగమించడం ఎలా? ఇలా ఎన్నో అంశాలలో సీఎం ముందు చూపుతో వ్యవహరించాలి. ఇందుకోసం సీఎం వెనక వందల మంది బలగం కూడా ఉంటుంది. వారందరి సహకారంతో సీఎం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి ఉంటుంది.
కానీ ఏపీలో మాత్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబ పెద్దగా ఘోరంగా విఫలమయ్యారు. నిలువెత్తు అనుభవరాహిత్యంతో ఆరు కోట్ల ఆంధ్రుల సంరక్షణ బాధ్యతలను గాలికొదిలేశారు. పాలన విషయంలో జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తేశారు. ప్రజల అవసరాలను అంచనా వేయడంలో అవగాహనా లేకపోవడంతో ప్రజలకు తీవ్ర కష్టాలను మిగిల్చారు. ఇందుకు ఉదాహరణే ఏపీలో విద్యుత్ కోతలు. అవును.. ఏపీలో ఇప్పుడు విద్యుత్ కోతలు ఘోరంగా ఉన్నాయి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలు దాటిదంటే ఎప్పుడు కరెంట్ పోతుందోనని భయాందోళన లతో జనం గడుపుతున్నారు. ఒక్కసారి కరెంట్ పోయిందంటే మళ్ళీ ఏ అర్ధరాత్రి తర్వాతనో వస్తుంది. ప్రతి రోజూ గంట నుండి ఐదారు గంటలు కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రధాన నగరాలు మినహా పట్టణాలు, గ్రామాలలో ఇదే పరిస్థితి. గత నెల రోజులుగా ఇలా విద్యుత్ కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఏపీలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతమే ఎక్కువ కనుక ఎప్పుడూ ఇక్కడ ఉక్కపోత సర్వసాధారణం. దీనికి తోడు దోమల బెడదతో ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.
అనధికారకంగా భారీ స్థాయిలో విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు తెగ తిట్టిపోస్తున్నారు. ఘోరంగా విద్యుత్ కోత విధిస్తున్నారని లైన్ మెన్ ను సంప్రదిస్తే తమకేమీ తెలియదని సమాధానమిస్తున్నారు. ఇంజనీర్ స్థాయి అధికారిని సంప్రదిస్తే తమ వద్ద ఎలాంటి లోపాలు లేవని పై నుండే కోత ఉందని చెప్తున్నారు. రాష్ట్రంలో ఇలా విద్యుత్ కోతలు విధిస్తున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం టోల్ ఫ్రీ నంబర్ 1902కు కాల్ చేస్తే.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నామని చెప్తున్నారు తప్ప కనీసం ఫిర్యాదు కూడా నమోదు చేయడం లేదు. ఇక విద్యుత్ శాఖకి చెందిన అధికారిక టోల్ ఫ్రీ నంబర్ 1912కు చేస్తే ఎమెర్జనీ లోడ్ ఇష్యు ఉందని.. డిమాండ్ కు తగిన సప్లై లేదని.. ఈ కారణంగానే ప్రధాన నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలకు తప్ప మిగతా ప్రాంతాలకు కోత విధించమని ఆదేశాలు ఉన్నాయని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ప్రజల నుండి ఫిర్యాదులపై కూడా ఉన్నతాధికారులకు ఇప్పటికే పలుమార్లు చెప్పినా వాళ్ళేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని కూడా చెప్పేస్తున్నారు.
నిజానికి ఏపీలో విద్యుత్ కోతలకు ప్రధాన కారణం ప్రభుత్వం ముందు చూపులేకపోవడం.. ఆర్ధిక పరిస్థితి కారణంగా చెప్పుకోవాలి. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధాన మార్గమైన బొగ్గు నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ల కోసం రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గును కొని నిల్వ చేసుకోలేదు. ప్రకృతి విపత్తులను దృష్టిలో పెట్టుకొని కనీసం రెండు వారాలకు సరిపడా బొగ్గును నిల్వ ఉంచుకోవడం విద్యుత్ సంస్థలు చేయాల్సిన పని. కానీ బొగ్గును మోసుకొచ్చే గూడ్స్ రైలు ఒక్కరోజు రాకపోతే ఇక కోతలే అన్నట్లుంది ఇప్పుడు ఏపీ పరిస్థితి. అదే సమయంలో విద్యుత్ సంస్థల పేరుతో వేలకోట్ల రుణాలు తీసుకుని దారి మళ్లించి వీటి సామర్థ్యాన్ని పెంచడానికి పెద్దగా ఖర్చుపెట్టలేదు. పోనీ ఇప్పుడు అవసరాన్ని బట్టి బహిరంగ మార్కెట్లో కొంటున్నదా అంటే అదీ లేదు. కొనేందుకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. గతంలో విద్యుత్ కంపెనీలను వేధించిన కారణంగా వారెవరూ ఏపీ ప్రభుత్వానికి విద్యుత్ అమ్మే పరిస్థితిలో లేరు. దీంతో ప్రజలకు నిత్య నరకం తప్పడం లేదు. ఇక వాన ముసురు పడితే ఇది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకొనేందుకు కూడా వణుకు పుడుతుంది.