గురక ఇక దూరం!
posted on Aug 6, 2019 @ 12:09PM
ఇంట్లో ఎవరైనా గురక పెట్టేవారుంటే వాళ్లు సుఖంగా నిద్రపోతారేమో కానీ, మిగతావారికి మాత్రం జాగారం తప్పదు. ఎందుకంటే గురక సమస్య మనకంటే మన తోటివారినే ఎక్కువగా విసిగిస్తుంది. ఇక కొత్త చోట గురక పెడితే అది అవతలివారికి మన మీద దురభిప్రాయాన్ని కలిగించే ప్రమాదమూ లేకపోలేదు. చుట్టుపక్కల వారు చూసీ చూడనట్లు ‘మీకు బాగా గురకపెట్టే అలవాటు ఉన్నట్లుందే!’ అని బయటపడినా కూడా ‘అబ్బే అలాంటిదేమీ లేదు!’ అంటూ దాటవేస్తూ ఉంటారు చాలామంది. అలా నామోషీపడి మన గురక అలవాటుని లేదన్నట్లుగా భ్రమిస్తే చివరికి నష్టపోయేది మనమేనంటున్నారు నిపుణులు.
ఇవీ కారణాలు!
ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే గాలికి కొండనాలికకి అడ్డుపడుతూ ఉండటం వల్ల గురక శబ్దం వస్తుంది. ఇలా జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
- కొండనాలిక చుట్టూ కొవ్వు పేరుకునిపోయి, శ్వాస వెళ్లే ద్వారం సన్నబడిపోవడం.
- ఆస్తమా, సైనస్ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు.
- జలుబు, కఫంతో కూడిన దగ్గు వంటి తాత్కాలిక సమస్యలు.
- ఊబకాయం వల్ల నోటి ద్వారా గాలిని పీల్చుకోవలసి రావడం.
- ధూమపానం వల్ల శ్వాసనాళాలు మూసుకుపోవడం.
- మద్యపానం కలిగించే మత్తులో గొంతులోని కండరాలు అదుపుతప్పడం.
- ఆలస్యంగా అందులోనూ భారీగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి ఏర్పడటం.
ఇవీ సూచనలు!
గురక కేవలం ఒక అనారోగ్యం కాదు. మన శరీర వ్యవస్థలో ఏదో లోపం ఏర్పడిందని చెప్పే సూచన!
- గుండె జబ్బులు ఉన్నవారిలో గురక అలవాటు అధికంగా ఉంటుంది. గురక అలవాటు ఉన్నవారిలో గుండెపోటు రావడానికి 30 శాతానికి పైగా అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
- పక్షవాతానికీ గురకకీ మధ్య కూడా చాలా తీవ్రమైన సంబంధం ఉందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఐరోపా ప్రజలను పరిశీలించినప్పుడు వారిలో గురకకీ, పక్షవాతానికీ మధ్య ఏకంగా 67 శాతం సంబంధం ఉన్నట్లు తేలిందట.
- లోలోపల మానసిక సమస్యలతో కుంగిపోతూ సరిగా నిద్రపట్టనివారిలో గురక పెట్టే అలవాటు ఎక్కువగా ఉంటుందంటున్నారు వైద్యులు.
- అధిక రక్తపోటు, కండరాల సమస్యలు వంటివి కూడా గురకకు దారితీయవచ్చు.
ఇవీ మార్గాలు!
గురకను తగ్గించేందుకు అన్నిరకాల వైద్యవిధానాలలోనూ మందులు లభిస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితులలో శస్త్రచికిత్స ద్వారా దీనిని నివారించుకునే అవకాశం ఉంది. కానీ చిన్నపాటి జాగ్రత్తలను కనుక పాటిస్తే చాలామందిలో గురక సమస్యను నివారించవచ్చు. అవేమిటంటే...
- రాత్రివేళల్లో మితమైన, అది కూడా త్వరగా అరిగిపోయే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారం కూడా నిద్రపోయే వేళకి అరిగిపోయేట్లుగా ఉండాలి.
- ప్రాణాయామం వంటి పద్ధతుల ద్వారా శ్వాసకోశంలో ఉన్న సమస్యలను, తద్వారా గురకనూ నివారించవచ్చు.
- పడుకునే ముందు కాస్త ఆవిరి పడితే ముక్కు, గొంతులో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి.
- వెల్లకిలా పడుకున్నప్పుడే గురక పెట్టే సమస్య అధికంగా ఉంటుంది. అందుకని పక్కకి తిరిగి పడుకుంటే ఈ సమస్య తాత్కాలికంగా అయినా తగ్గుతుంది. అందుకు తగినన్ని దిళ్లని మెడ కింద పేర్చుకోవాలి.
- ఇక వెల్లకిలా పడుకున్నప్పుడు, తల కింది ఎక్కువ ఎత్తు ఉండటం వల్ల కూడా శ్వాసకి అడ్డంకులు ఏర్పడి, గురకకి దారితీస్తాయి. కాబట్టి తల కింద వీలైనంత తక్కువ ఎత్తుతో పడుకోవడం మంచింది.
- ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్యకర అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- అన్ని అనర్థాలకూ మూలకారణం ఊబకాయం. శరీర బరువును, ఆకారాన్నీ నియంత్రించుకుంటే గురకే కాదు... దాంతో పాటుగా సవాలక్ష సమస్యలు మాయమైపోతాయి.
చాలామంది గురక వల్ల కేవలం అవతలివారికే ఇబ్బంది అనుకుంటారు. నిజానికి గురక పెడుతున్నవారు కూడా హాయిగా నిద్రపోతున్నారని చెప్పడానికి లేదు. పైగా గురుక శబ్దం వల్ల వారిలోని గుండె కండరాలు నాశనమైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురకని నివారించుకునే ప్రయత్నాలు చేయడానికి ఈ హెచ్చరిక చాలేమో!
- నిర్జర.