మనవడి ఆరోగ్యం... మీ చేతుల్లోనే!

ఓ సినిమాలో బ్రహ్మానందం తన జీవితంలో ఉన్న కష్టాలన్నింటికీ తాతే కారణం అని హడావుడి చేస్తుంటాడు. ఎవరి జీవితాన్ని వాళ్లు తీర్చిదిద్దుకోవాల్సిందే కాబట్టి, బ్రహ్మానందం అన్న మాటలు నవ్వులనే పండించాయి. కానీ ఆరోగ్యం విషయంలో మాత్రం తాత పాత్ర తప్పకుండా ఉందంటున్నారు సిడ్నీకి చెందిన కొందరు పరిశోధకులు. అనడమే కాదు నిరూపిస్తున్నారు కూడా...

 

ఆ మధ్య ఎప్పుడో తండ్రి ఆరోగ్యం పిల్లల మీద ప్రభావం చూపుతుందంటూ అమెరికాలో ఒక పరిశోధన తేల్చి చెప్పింది. పిల్లల్ని కనాలనుకునేవారు సరైన ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలనీ, లేకపోతే వారి పిల్లల్లో ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయని సదరు పరిశోధన తేల్చింది. అది నిజమే కానీ! తాతల ఆలవాట్లు సవ్యంగా లేకపోతే, తండ్రి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఉపయోగం లేదని తాజా పరిశోధన చెబుతోంది. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు కొన్ని ఎలుకలకు రకరకాల ఆహారాలను అందించి చూశారు. సదరు ఆహారాలను తీసుకున్న ఎలుకల తొలి తరాన్నీ, ఆ తరువాతి తరాన్నీ నిశితంగా పరిశీలించారు. అలా తేలిన ఫలితాలే ఇవి. 

 

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం తాతయ్యలలో చక్కెర పదార్థాలను తీసుకునే అలవాటు, చిరుతిళ్లను లాగించే బలహీనతా ఉంటే... వారి మనవళ్లలో జీవక్రియ (మెటాబాలిజం) సంబంధమైన సమస్యలు త్వరగా తలెత్తుతాయని తేలింది. వీరి మనవళ్ల శరీరంలో చక్కెర నిల్వలు అదుపు తప్పిపోవడం, డయాబెటీస్, ఫ్యాటీ లివర్‌ వంటి సమస్యలు తలెత్తే అవకాశం అధికమట. దీనికి తోడు తండ్రి ఆహారపు అలవాట్లు కూడా సవ్యంగా లేకపోతే ఇక చెప్పేదేముంది! రెండు తరాలుగా వస్తున్న చెడు అలవాట్లకు మనవడు పూర్తిగా శిక్షను అనుభవించాల్సి వస్తుంది.

 

ఏతావాతా తేలిందేమంటే... పుట్టబోయే బిడ్డ మీద తండ్రి ఆహారపు అలవాట్ల కంటే తాతగారి అలవాట్లే ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అంటే మన జీవనశైలి మరో రెండు తరాల ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా మసులుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలా ఎందుకు జరుగుతుందీ అంటే కారణం చెప్పలేకపోతున్నారు కానీ... జరుగుతుంది అనడంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదంటున్నారు. అయితే తాత, తండ్రుల ఆరోగ్యపు అలవాట్లు కేవలం మగపిల్లల మీదే ప్రభావం చూపడం మరో విచిత్రం!

 

ఇన్నాళ్లూ బిడ్డ ఆరోగ్యానికి కారణం జన్యువులేననీ, మహా అయితే అతని తల్లి అలవాట్లు అతని మీద ప్రభావం చూపే అవకాశం ఉందనీ అంతా భావిస్తూ వచ్చారు. కానీ రానురానూ బయటపడుతున్న ఇలాంటి పరిశోధనలు పిల్లల ఆరోగ్యంలో తండ్రుల పాత్ర, ఆ మాటకు వస్తే తాతల పాత్ర తక్కువేమీ కాదని తేలుస్తున్నాయి. మరి సవ్యమైన ఆహారపు అలవాట్లు లేనివారికి పుట్టినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే... దానికీ ఓ సలహాను పడేస్తున్నారు పరిశోధకులు. ఒక అద్దెకారుని ఎంత భద్రంగా చూసుకోవాలో, మీ శరీరాన్ని కూడా అంతే భద్రంగా చూసుకోమని చెబుతున్నారు. ఎడాపెడా వాడేయకుండా, ఏదో ఒక సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్న జాగరూకతతో మెసులుకోమంటున్నారు. ఇంతకంటే తాత, తండ్రుల నుంచి వచ్చిన బలహీనతల నుంచి రక్షించుకునేందుకు మరో మార్గమేదీ లేనేలేదట!

- నిర్జర.