సిట్టింగ్ ల మార్పు సంకేతం అదేనా.. జగన్ చేతులెత్తేశారా?
posted on Jan 5, 2024 @ 3:43PM
ఏపీలో అధికార వైసీపీ ఇప్పుడు ఓటమి భయంతో వణికిపోతోంది. జగన్ ప్రభుత్వానికి ఓటమి తప్ప మరో మార్గమే లేదని రాజకీయ పరిశీలకులు ఇప్పటికే విశ్లేషణలతో తేల్చేశారు. వ్యూహకర్తలుగా ఉన్న ఐ ప్యాక్ లాంటి సంస్థ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, ఇక ఇప్పుడు ఏం చేసినా ఫలితం లేదని తేల్చేసినట్లు కూడా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇప్పుడు వైసీపీ పెద్దలకు ఏం చేయాలో తోచని పరిస్థితి. అయితే సీఎం జగన్ మాత్రం ఇంకా దింపుడు కళ్లం ఆశతో ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేస్తూ అదే తమ గెలుపు మంత్రంగా కలరింగ్ ఇస్తున్నారు. తొలి విడతలో 11 నియోజకవర్గాల ఇంచార్జిలను మార్చేసిన జగన్.. రెండో విడతలో మరో 27 మందిని మార్చేశారు. మొత్తంగా 90కి పైగా స్థానాలలో ఈ స్దాన భ్రంశం అనే కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తున్నది. అయితే జగన్ ఇదే తన గెలుపు మంత్రం అని చెప్తున్నా.. పార్టీలో గందరగోళం నెలకొని కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయే కానీ, ఎవరిలోనూ విజయంపై విశ్వాసం మాత్రం కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు వైసీపీకి సిట్టింగుల మార్పు అన్నదే పెద్ద సమస్యగా మారిపోయింది.
నిజానికి వైసీపీ ఈ విధంగా అభ్యర్థులను మార్చేసి ప్రజలను నమ్మించాలనుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నది. ఎందుకంటే ప్రజలు అంత సులభంగా ఈసారి వైసీపీని నమ్మి ఓటేసే పరిస్థితి లేదు. కానీ జగన్ మాత్రం సీనియర్లు, జూనియర్లు అని లేకుండా అందరినీ మార్చేస్తున్నారు. కొందరినైతే పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. దీంతో అసలు సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా గెలిపించలేని జగన్.. పార్టీ అధ్యక్షుడిగా అవసరమా అనే ప్రశ్నలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. పుల్లను నిలుచోబెట్టి గెలిపిస్తా అన్న జగన్.. ఇప్పుడు సిట్టింగ్ స్థానాలను ఎందుకు మారుస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. తాజాగా తెలుగేదేశం అధినేత చంద్రబాబు ఈ తరహాలో వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో రాజకీయ వర్గాలలో ఇప్పుడు ఇదే ప్రధాన చర్చగా మారింది. కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోలేని స్థితికి జగన్ దిగజారిపోయారని.. తనపై, తన పరిపాలనపై ప్రజలలో నెలకొన్న అసంతృప్తి పాపాన్ని ఎమ్మెల్యేలపై రుద్దుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గతంలో వైసీపీ తొలి జాబితా విడుదల చేసిన సమయంలో కూడా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసంతృప్తి ఎక్కువగా ఉందనే కారణంతో ఎమ్మెల్యేలను మార్చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి.. సీఎంగా తనపై కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో అసంతృప్తి ఉందని.. మరి సీఎం అభ్యర్థిని కూడా మార్చేస్తారా అనే ప్రశ్నలు వినిపించాయి. సీఎంగా జగన్ కాకుండా ఎవరిని ప్రకటిస్తారని నెటిజన్లు సూటిగా ప్రశ్నించారు. ఆ ప్రశ్నలపై ఎలా స్పందించాలో వైసీపీ నేతలకు కూడా అర్ధం కాక తలలు పట్టుకున్నారు. ఇక ఇప్పుడు రెండో జాబితా తర్వాత సిట్టింగులను గెలిపించుకోలేని జగన్ పార్టీ అధ్యక్షుడిగా అవసరమా.. అసలు ఎమ్మెల్యేలు అలాంటి పార్టీలో కొనసాగడం అవసరమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన బొమ్మతోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని చెప్పుకొనే జగన్.. ఇప్పుడు సిట్టింగులను కూడా తన బొమ్మతో గెలిపించలేకపోతున్నారా అని పార్టీలోనే చర్చ జరుగుతోంది. అసలు కనీసం జగన్ అయినా తన స్థానంలో పోటీ చేస్తారా? లేక తాను కూడా నియోజకవర్గం మారిపోతారా? అని సెటైర్లు కూడా వేసుకుంటున్నారు.
నిజానికి ఈ ప్రశ్నలలో అర్ధం ఉంది. తన నియోజకవర్గంలో గెలవడం ఏ ఎమ్మెల్యే అయినా చేస్తాడు.. కానీ, రాష్ట్రమంతా ప్రభావం చూపి తనతో పాటు మిగతా ఎమ్మెల్యేల గెలుపులో కూడా కీలకం అయ్యేది ఒక్క పార్టీ అధ్యక్షుడే. కానీ, ఇప్పుడు వైసీపీలో పార్టీ అధ్యక్షుడిని చూసి ఓటేసే పరిస్థితి లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకతకు కీలకం సీఎం జగనే కనుక ప్రజలు ఇప్పుడు జగన్ అంటే మండిపడుతున్నారు. దీంతో తన బొమ్మను పక్కకి పెట్టేసి.. స్థానాలను మార్చేసి ప్రజలను బురిడీ కొట్టించాలని జగన్ చూస్తున్నారు. ఆ మాటకొస్తే జగన్ ఇప్పుడు ఈ అభ్యర్థుల మార్పుతో తన స్థాయిని తానే దిగజార్చుకున్నారు. తాను ఎమ్మెల్యేలను గెలిపించలేనని, తనను చూసి ఎమ్మెల్యేలకు ఓటేసే పరిస్థితి లేదని తనకు తానే ఒప్పుకున్నట్లు అయింది. ఎమ్మెల్యేలు ఎవరి గెలుపునకు వారే కష్టపడి.. ఎమ్మెల్యేలే తనను కాపాడాలని జగన్ పరోక్షంగా చెప్పేసి చేతులెత్తేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.