బీఆర్ఎస్ లో భగ్గుమంటున్న వర్గ పోరు.. సముదాయించేందుకు నేతల సతమతం!
posted on Jan 5, 2024 @ 3:16PM
ఎన్నిక ఏదైనా విజయం మాదే అంటూ తరచూ చెప్పుకునే బీఆర్ఎస్ పరిస్థితి ఒక్క ఓటమితో కకావికళమైపోయినట్లు కనిపిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ఆ పార్టీ వర్గ పోరు పార్టీ ఆగ్రనాయకుల ఎదుటే భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని పక్కన పెట్టి రానున్న లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న బీఆర్ఎస్ కు పార్టీలో వర్గపోరు కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది.
తెలంగాణ భవన్ లో శుక్రవారం (జనవరి 5) జరిగిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహేందర్ రెడ్డి మాట్లాడుతుండగా రోహిత్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మమేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల వారు పోటాపోటీగా నినాదాలు చేయడం, కుర్చీలు విసురుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. వాతావరణం వేడెక్కింది. ఇరు వర్గాల వారికీ మాజీ మంత్రి హరీష్ రావు సర్ది చెప్పడానికి చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది. దీంతో హరీష్ రావు మహేందర్ రెడ్డి, రోహిత్ రెడ్డిలతో ప్రత్యేకంగా సమావేశమై సర్ది చెప్పారు. సమావేశాల్లో బహిరంగంగా ఇలా తలపడితే పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెడతాయని క్లాస్ పీకారు.
అనంతరం ఇరు వర్గాలూ శాంతించారు. ఈ భేటీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు కూడా ఉన్నారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక విషయంలో కూడా పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అనివార్యంగా పార్టీ అధినేత కేసీఆర్ నే ఏకగ్రీవంగా బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఓటమి తరువాత మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కు పార్టీలో వర్గ విభేదాలు, అసమ్మతి గళాలు అవరోధంగా మారాయని చెప్పక తప్పదు.