సింగపూరో, చికాగో ఏదయినా ముందు డబ్బులు కావాలి కదా
posted on Sep 8, 2014 @ 2:55PM
విజయవాడ వద్ద ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకోవడంతో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకొన్నందుకు కాంగ్రెస్, వైకాపాలు మొదట అధికార పార్టీపై విమర్శలు గుప్పించినా, విజయవాడకే అవి కూడా మొగ్గు చూపాయి. ఆ తరువాత సింగపూరా లేక చికాగో నమూనాలో నిర్మించాల అనే దానిపై కూడా ఆసక్తికరమయిన చర్చ కూడా మొదలయింది.
ఒక అమెరికా సంస్థ ప్రతినిధులు వచ్చి చికాగో నమూనాలో కృష్ణా నదికి ఇరువైపులా రాజధానిని నిర్మిస్తే ఎలా ఉంటుందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బొమ్మేసి (పవర్ పాయింట్ ప్రెజంటేషన్ అన్న మాట) చూపించారని, ఆయన కూడా దానిని ‘లైక్’ చేశారని మీడియా వాళ్ళు రాసుకొంటుంటే, ఈలోగా సింగపూరు వాళ్ళు కూడా రంగంలో దిగి, ఆరేళ్ళ క్రితం తమ సంస్థ చైనాలో ‘టియాన్ జిన్’ అనే పర్యావరణ స్నేహపూరితమయిన పట్టణాన్ని ఏవిధంగా నిర్మించామో అదేవిధంగా విజయవాడలో కూడా రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తాజా సమాచారం. బహుశః త్వరలోనే మరికొన్ని దేశాల సంస్థల ప్రతినిధులు స్కెచ్ వేసి చూపించేందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.
అయితే అన్నిటి కంటే ముందు తేల్చుకోవలసిన విష్యం ఏమిటంటే రాజధాని నిర్మాణానికి భూముల సమీకరణ ఎప్పటిలోగా పూర్తవుతుంది? వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా, ఎప్పటిలోగా నిధులు సమీకరించుకొంటుంది? రాజధాని నిర్మాణ పనుల కోసం కేంద్రం ఎప్పుడు ఎంత మొత్తం విడుదల చేస్తుందనే విషయాలు దృవీకరించుకొన్న తరువాతనే రంగంలో దిగడం అన్ని విధాల మంచిది. లేకుంటే చివరికి కాగితాల మీద స్కెచ్చులు, కంప్యూటర్లలో బొమ్మలే చూసుకొని తృప్తిపడవలసి వస్తుంది.
రాజధాని నమూనా కోసం మంత్రులతో కూడిన ఒక కమిటీ, భూసేకరణ కోసం మరో ఉప కమిటీ కూడా వేసింది కనుక బహుశః ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం తెర వెనుక ఈ పనులన్నీ గట్టిగానే చేస్తోందని అనుకోవలసి ఉంటుంది.
నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన సింగపూరుకు చెందిన బిల్డింగ్ అండ్ కంస్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులు తమ సంస్థ చైనాలో కేవలం ఆరు సం.లలో ‘టియాన్ జిన్’ అనే పట్టణాన్ని నిర్మించామని తెలిపారు. రాజకీయాలకు తావులేని చైనా వంటి క్రమశిక్షణగల దేశంలో ఒక పట్టణం నిర్మించడానికి ఆరేళ్ళు పడితే, ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడానికే అలవాటు పడిన మనదేశంలో అది కూడా ఇన్ని సమస్యలు, పరిమితుల మధ్య సింగపూరో లేకపోతే చికాగో తరహాలో రాజధాని ఏర్పాటుకి ఎన్నేళ్ళు పడుతుందో ఎవరి ఊహకీ అందని విషయం.
ఈ ఐదేళ్ళలో కొత్త రాజధానికి కొంత మేరయినా రూపురేఖలు తేగలిగినట్లయితే అది అధికార పార్టీ సమర్ధతకు, కార్యదీక్షకు మచ్చు తునకగా నిలుస్తుంది.కానీ మాటలు కార్యరూపం దాల్చకపోయినట్లయితే అది వచ్చే ఎన్నికలలో ప్రధాన అంశంగా మారడం తద్యం. కనుక ఈ విషయంలో చాలా చురుకుగా పనిచేయాల్సి ఉంటుందని అధికార పార్టీకి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు జ్ఞాపకం ఉంచుకోవడం చాలా అవసరం.