శుభమన్ గిల్ డబుల్ సెంచరీ..న్యూజిలాండ్ తో తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం
posted on Jan 19, 2023 6:19AM
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల వరకూ వెళ్లినా బ్రేస్ వెల్ బ్రేస్ వెల్ పోరాటం జట్టును పోటీలోకి తీసుకువచ్చింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్ శుబ్ మన్ గిల్ 149 బంతులలో ఆరు సిక్సర్లు, 19 ఫోర్లతో అజేయంగా 208 పరుగులు చేశాడు. గిల్ మినహా మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. స్కిప్పర్ రోహిత్ శర్మ 38 బంతులలో 34 పరుగులు, విరాట్ కోహ్లీ పది బంతులలో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. తర్వాత ఇషన్ కిషన్ 14 బంతులలో 5 పరుగులు చేసీ ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 31 పరుగులు, హార్దిక్ పాండ్యా 38 బంతులలో 28 పరుగులు చేశారు. ఇక చివరిలో వాషింగ్టన్ సుందర్ 14 బంతులలో 12 పరుగులు చేయగా .. శార్దుల్ ఠాకూర్ మూడు బంతులలో మూడు పరుగులు చేయడం జరిగింది.
భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఆరంభం నుండే వికెట్లు కోల్పోతూ వచ్చింది. 130 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన దశలో ఆ జట్టు విజయం గురించి ఎవరికీ అంచనాల్లేవు. ఆ స్థితిలో బ్రేస్ వెల్, శాంట్నార్ క్రీజులో నిలదొక్కుకొని అటాకింగ్ గేమ్ ఆడి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇ న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ ను రేసు గుర్రంలా పరుగులు పెట్టించారు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది.
అయితే ఒక అధ్భుత బంతితో సిరాజ్ శాంట్నార్(57)ను అవుట్ చేయడంతో న్యూజిలాండ్ జోరు తగ్గింది. ఆ తర్వాత బ్రేస్ వెల్.. ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాట్స్ మెన్ లు…క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. దీంతో 12 పరుగుల తేడాతో ఇండియా గెలవడం జరిగింది.
ఉత్కంఠ భరీతంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్ సిరజ్ 4 వికెట్లు తీశాడు.శుభమన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో డబుల్ సెంచురీ బాది తన సత్తా చూపారు శుభమన్. కేవలం 145 బంతుల్లోనే డబుల్ సెంచురీ చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో శుభమన్ ఆట క్రికెట్ లవర్స్ ను అలరించింది. ఇలా వన్డేల్లో డబుల్ సెంచురీ చేసిన ఐదవ ఇండియన్ క్రికెటర్ గా శుభమన్ గిల్ నిలిచాడు. డబుల్ సెంచురీ ఫీట్ లో భాగంగా ఆయన 19 బౌండరీలు, 8 సిక్సులు కొట్టి ఆకట్టుకున్నారు. వన్డేల్లో ఇలా డబుల్ సెంచురీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు శుభమన్ గిల్.