నా కంటే పెద్ద మూర్ఖుడెవరు?.. ఎలాన్ మస్క్
posted on Dec 21, 2022 @ 2:49PM
ట్విట్టర్ సీఈవోగా తాను ఉండాలా? వద్దా అంటూ ఎలాన్ మస్క్ నిర్వహించిన పోల్ లో అత్యధికులు ఆయన సీఈవోగాతప్పుకోవాలని ఓటేశారు. దీంతో హతాశుడైన మస్క్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టడానికి నా కంటే మూర్ఖుడెవరైనా దొరకాలిగా.. దొరకగానే తప్పుకుంటానంటూ ట్వీట్ చేశాడు. ట్విట్టర్ సీఈవోగా తాను తప్పుకునే ప్రశక్తే లేదని చెప్పకనే చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో మస్క్ కంటే మూర్ఖుడు దొరికే అవకాశమే లేదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏ ముహూర్తాన ట్విట్టర్ పగ్గాలు తీసుకున్నాడో ఆ క్షణం నుంచీ అత్యంత వివాదాస్పదుడిగా మారిపోయాడు. కేవలం టెస్లా అధినేతగా ఉన్నంత కాలం ఎలాన్ మస్క్ విషయంలో ఎలాంటి వివాదాలూ లేవు. కానీ ఎప్పుడైతే ట్విట్టర్ పగ్గాలు అందుకున్నాడో ఆ క్షణం నుంచీ ప్రపంచంలో అత్యంత వివాదాస్పదుడైన పారిశ్రామిక వేత్తగా మారిపోయాడు. ట్విట్లర్ లో వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడం నుంచీ ట్వీట్టర్ విధానాలలో మార్పులు చేయడం వరకూ, తన విధానాలను వ్యతిరేకించే జర్నలిస్టుల ఖాతాలను ట్విట్టర్ నుంచి తొలగించడం నుంచి.. ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతుందని ప్రకటించడం వరకూ ఎలాన్ మస్క్ ప్రతి చర్యా, ప్రతి అడుగూ వివాదాస్పదంగానే తయారైంది.
అయితే తాజాగా ట్విటర్ వ్యవహారాలపై తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండటంతో ఎలాన్ మస్క్ అంతర్మథనంలో పడ్డారు. ట్విట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అన్న మీమాంశలో పడ్డారు. తాను ట్వట్టర్ సీఈవోగా కొనసాగాలా వద్దా అంటే ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టాడు. అందులో 58 శాతానికి పైగా ఎలాన్ మస్క్ వైదొలగాలనే ఓటు చేశారు. ఓ 42 శాతం మంది మాత్రం ఎలాన్ మస్క్ కు అనుకూలంగా ఓటేశారు. దీంతో ఎలాన్ మస్క్ కొత్త సీఈవో తన కొంటే మూర్ఖుడు అయి ఉండాలని పేర్కొంటూ.. సీఈవోగా వైదలగడం లేదని స్పష్టం చేశాడు.