రాహుల్ భారత్ జోడో యాత్రకు కోవిడ్ ప్రొటోకాల్..కేంద్రం హుకుం
posted on Dec 21, 2022 @ 2:25PM
కరోనా మహమ్మారి విజృంభణ ప్రపంచంలో ప్రమాద ఘంటికలు మోగిస్తోందన్న వార్త అందరిలోనూ భయాందోళనలను రేకెత్తించింది నిజమే. రాష్ట్రాలకు కేంద్రం కరోనా విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు సూచించింది. అదే సమయంలో భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రత పెరిగే అవకాశాలు తక్కువే అని ధైర్యమూ చెప్పింది.
అయితే సక్సెస్ ఫుల్ గా జరుగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విషయంలో మాత్రం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ప్రొటో కాల్ పాటించేటట్లయితే మాత్రమే యాత్రను కొనసాగించాలనీ, లేకుండా యాత్ర వాయిదా వేసుకోవాలనీ సూచన ప్రాయమైన హెచ్చరిక చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మున్ సుక్ మాండవీయ ఈ మేరకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాశారు. ఆ లేఖలో యాత్రలో పాల్గొనే వారంతా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటిండం, శానిటైజర్లు వాడటం వంటికి తప్పని సరి అని పేర్కొన్నారు. అలాగే ప్రికాషనరీ డోస్ తో సహా వ్యాక్సినేషన్ చేయించుకున్న వారు మాత్రమే యాత్రలో పాల్గొనాలని కండీషన్ పెట్టింది. అలా చేయడం కుదరదనుకుంటే యాత్రను వాయిదా వేసుకోవాలని సూచించింది.
ఈ లేఖపై కాంగ్రెస్ భగ్గు మంది. రాహుల్ భారత్ జోడో యాత్రకు విశేష జనస్పందన లభిస్తుండటం.. ఒకరి తరువాత ఒకరుగా సెలబ్రిటీలు ఆయనతో అడుగులు కలపడంతో కేంద్ర ప్రభుత్వం రాహుల్ యాత్ర విషయంలో అప్రమత్తమైంది. ప్రధాని మోడీయే స్వయంగా కాంగ్రెస్ ను తక్కువ అంచనా వేయవద్దని పార్టీ శ్రేణులను హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో కరోనా వ్యాప్తి సాకుగా తీసుకుని కేంద్రం రాహుల్ యాత్రపై ఆంక్షలు విధిస్తోందని విమర్శించింది.
ఇతర పబ్లిక్ ప్లేసుల్లో, సమావేశాల్లో ఏ ప్రొటోకాల్ రూల్స్ అమలవుతున్నాయని ప్రశ్నించింది. ఉన్నట్లుండి కాంగ్రెస్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విషయంలోనే ప్రొటోకాల్ రూల్స్ గుర్తొచ్చాయా అని నిలదీసింది. . గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ చేపట్టిన ర్యాలీలు, సభల్లో కోవిడ్ ప్రొటోకాల్ ఫాలో అయ్యారా? రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’కు వస్తున్న స్పందన చూడలేకే కేంద్ర మంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.