ఇలాగైతే మొదటిరౌండ్‌తో సరి... షోయెబ్ అక్తర్
posted on Sep 17, 2022 @ 1:20PM
ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించి ఫైనల్లో శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఈసారి టైటిల్ పాక్‌దే అనుకున్నారు. కానీ చివార్న చతికిలపడింది. అసలు మొత్తానికి గమనిస్తే, ఆ టోర్నీలో పాక్ ఆట పేలవంగానే ఉంది. అందరూ అనుకున్నంత, అంటున్నంత గొప్పగా ఏమీ లేదని పాకిస్తాన్ క్రికెట్ మాజీలే మండిపడుతున్నారు. ఆసియాకప్ కాబట్టి గట్టిగా ఏమీ అనలేముగాని టీ-20 ప్రపంచకప్ కి ఇలాంటి జట్టు అస్సలు పంపవద్దని పాక్ క్రికెట్ బోర్డుకి సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్, కాంబి నేషన్ చాలా దారుణంగా ఉందని మాజీ పాక్ పేసర్ షోయెబ్ అక్తర్ మండిపడుతున్నాడు.
అక్టోబర్-నవంబర్‌ల్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ-20 ప్రపంచకప్‌కి పాక్ జట్టును పాక్ బోర్డు ప్రకటించింది. కానీ దాని పట్ల సీనియర్లు ఎవ్వరూ సంతృప్తి వ్యక్తం చేయలేదు. బాబర్ అజామ్, షదాబ్ ఖాన్‌ల నాయకత్వంలో వెళ్లే జట్టు చాలా పేలవంగా ఉందని విజయం సాధించే దిశలో ఆడగలదన్న నమ్మకం లేదని మాజీలు విమర్శిస్తున్నారు. ఆసియా కప్‌లో ఆడిన జట్టుకీ ఈ జట్టుకీ పెద్ద తేడా లేదన్నారు.
కెప్టెన్‌గా బాబర్ పెద్దగా రాణించడం లేదని, అతనిలో బ్యాటింగ్ పదును తగ్గిందని, ఆసియా కప్‌లో అతని ఆటతీరు గొప్పగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పాక్ మాజీలు అన్నారు. అంతకు మించి మిడిల్ ఆర్డర్ చాలా పేలవంగా ఉందని అక్తర్ అన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంటేనే ఆస్ట్రేలి యాలో కనీసం సెమీస్ చేరడానికి అవకాశం ఉంటుదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్ చెప్పు కోదగ్గ పటిష్టత లేదన్నాడు. కేవలం ఒక్కరిద్దరు బ్యాటర్ల సామర్ధ్యాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద టోర్నీలకు వెళ్లడం ఎంతవరకూ సబబు అని అక్తర్ ప్రశ్నించాడు.
టీ-20 ప్రపంచకప్ తొలిమ్యాచ్ అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్ భారత్‌తో తలపడుతుంది.