షర్మిల హార్ట్‌బ్రేక్.. చెల్లి కంట కన్నీరు.. జగనన్నదే ఆ పాపం!
posted on Sep 2, 2021 @ 1:25PM
ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది. ఎల్లప్పుడూ దేనికైనా రెడీ అంటుంది. నెగ్గడమే కానీ.. తగ్గేదే లే అంటుంటుంది. విమర్శలు చేయడం.. విరుచుకుపడటమే ఆమె నైజం. ఆమె నోట మాటల తూటాలే. ప్రత్యర్థులకు ముచ్చెమటలే. అలాంటి వైఎస్ షర్మిల.. కంట కన్నీరు పెట్టింది.. బోరున విలపిస్తోంది. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు.. స్వయంగా ఆమే ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. అశ్రునయనాలతో ఆమె చేసిన ఆ కన్నీటి ట్వీట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె కన్నీటి గాథకు చలించిపోయిన వారంతా.. జగనన్నదే ఆ ద్రోహం.. ఆ పాపం.. అందుకు కారణం.. అంటూ తప్పుబడుతున్నారు. పోస్టులతో షర్మిలను ఓదారుస్తూనే.. సీఎం జగన్ను కామెంట్లో కుళ్లబొడుస్తున్నారు. ఇంతకీ షర్మిల చేసిన ట్వీట్ ఏంటంటే...
ఇదీ ఆమె బాధ. ఈ ట్వీట్‌లో ఎక్కడా జగనన్న పేరు ప్రస్తావించకున్నా.. ప్రతీ అక్షరంలోనూ జగనే కారణం అనేలా నర్మగర్భంగా చేశారా ట్వీట్. వైఎస్సార్ మరణించిన ఈ 12 ఏళ్లలో ఆమె ఏనాడు తాను ఒంటరి దాన్ని అయ్యానని భావించలేదు. తండ్రి తర్వాత తండ్రిలా జగనన్న తోడున్నాడని ధైర్యంగా ఉన్నారు. అలాంటి జగనన్నే తనను ఒంటరిదాన్ని చేసి.. ఇంటి నుంచి తరిమేయడంతో.. ఇప్పుడు తండ్రిలాంటి అన్న అండ లేక.. తాను ఒంటరి దాన్ని అయ్యాననే ఫీలింగ్ ఆ ట్వీట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు. జగన్ చేతిలో అవమానాలు, కష్టాలు ఎదురయ్యాయని చెప్పకనే చెప్పింది. జగనన్న చెల్లిని దూరం పెట్టడంతో.. తండ్రిలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందామెకు అంటున్నారు. అందుకే, తండ్రిని గుర్తు చేసుకుంటూ.. కంట కారుతున్న కన్నీరును తుడుచుకుంటూ.. బాధాతత్ప హృదయంతో ఈ ట్వీట్ చేసినట్టున్నారు షర్మిల.
ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి దగ్గర నివాళి అర్పించి వచ్చిన తర్వాతే షర్మిల ఈ ట్వీట్ చేయడం ఆసక్తికరం. అక్కడ తనకు జరిగిన అవమానభారం తట్టుకోలేకే.. ఇంటికెళ్లి వెక్కి వెక్కి ఏడ్చి.. అన్నను అనలేక.. తండ్రితోడు లేక.. ఇలా విషాదభరితమైన ట్వీట్ చేశారని అంటున్నారు. తండ్రి సమాధి సాక్షిగా జగనన్న చెల్లి షర్మిలను కనీసం పలకరించపోవడం.. ఓ నవ్వు కూడా నవ్వకపోవడం.. బాగున్నావా చెల్లి అని కూడా అనకపోవడంతో.. ఆ తీవ్ర అవమాన భారంతో కుమిలిపోయి.. ఆ ఉడుకుబోతుతనంతో ఇలా ట్విట్టర్‌లో ఆ గోడు వెళ్లబోసుకున్నారని చెబుతున్నారు. తండ్రి దూరమయ్యాడనే బాధతో పాటు జగనన్న సైతం దూరమయ్యాడనే ఆవేదన కూడా ఆమె మాటల్లో స్పష్టమవుతోందని అంటున్నారు. చెల్లి కంట కన్నీరు పెట్టించిన పాపం ఊరికోపోదంటూ.. జగనన్నపై సోషల్ మీడియాలో కామెంట్లతో కుమ్మేస్తున్నారు షర్మిల అభిమానులు.