షర్మిల దూకుడు.. వైసీపీ కకావికలు!
posted on Jan 30, 2024 8:57AM
ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ వైఎస్ షర్మిల స్పీడ్ పెంచారు. ఆమె ప్రశ్నలు, విమర్శలు, సొంత అన్న, ఏపీ సీఎం జగన్ ను సూటిగా నిలదీస్తున్న తీరు అధికార వైసీపీని కంగారు పెడుతున్నాయి. షర్మిల స్పీడుతో వైసీపీ కకావికలు అయిపోతున్నది.
అంతే కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు కూడా పటాపంచలైపోతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కావడం అంటే వైసీపీ ఖాళీ అయిపోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వారి విశ్లేషణలు వాస్తవమే అనిపించేలా ఏపీలో పరిణామాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల వదలడం లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గుడ్ విల్ ను పూర్తిగా సొంతం చేసుకున్న షర్మిల ఆయన హయాంలో రాజకీయాలలో చురుకుగా ఉండి ఆ తరువాత యాక్టివ్ గా లేని పార్టీ సీనియర్ నేతలను కలుస్తూ, వారి మద్దతు పొందడమే కాకుంగా, వారిని పార్టీలోకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు.
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డితో భేటీని పరిశీలకులు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి నడిచిన డీఎల్ రాష్ట్ర విభజన తరువాత రాజకీయాలలో పెద్దగా క్రియాశీలంగా లేరు. ఇప్పుడు షర్మిల కలిసినంత మాత్రాన ఆయన యాక్టివ్ అవుతారని చెప్పలేము. కానీ ఆయనను పార్టీలోకి తీసుకువచ్చేదిశగా షర్మిల ఒక అడుగు ముందుకు వేశారు. అలాగే వైఎస్ మిత్రుడు దుట్టా రామచంద్రరావుతోనూ షర్మిల భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతారని షర్మిల ప్రకటించారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న దుట్టా రామచంద్రరావుకు ఆ పార్టీలో పెద్దగా గుర్తింపు లేదు. జగన్ తీరు పట్ల, వైఖరి పట్ల దుట్టాలో తీవ్ర అసంతృప్తి ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైఎస్ కుమారుడన్న అపేక్షతో వైసీపీలో చేరిన ఆయన వైఎస్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ తీరు, వ్యవహారం లేదని సన్నిహితుల వద్ద పలు సందర్భాలలో తన అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా తన నడక వైఎస్ తోనేననీ, అయితే జగన్ తో కలిసి ముందుకు సాగేందుకు తనకు కష్టంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆయన సహచరులు చెబుతున్నారు.
ఈ సమయంలో షర్మిల ఆయనతో భేటీ కావడం, ఆయన కాంగ్రెస్ గూటికి చేరతారని ఆమె స్వయంగా ప్రకటించడం చూస్తుంటే ఇహనో ఇప్పుడో దుట్టా వైసీపీకి దూరం కావడం, చేయి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం షర్మిలకు రాష్ట్ర కాంగ్రెస్ లో కొండంత అండ అన్నట్లుగా ఆమె తండ్రి వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు ఉన్నారు. అలాగే తులసిరెడ్డి, రఘువీరారెడ్డి వంటి సీనియర్లు కూడా షర్మిలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. వీరు కూడా ఇంత కాలం పెద్ద క్రియాశీలంగా లేరు. అయితే షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత క్రియాశీలం అయ్యారు. మున్ముందు మరింత యాక్టివ్ గా పనిచసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ లో మసకబారిపోయిన వైఎస్ బ్రాండ్ ను షర్మిల తన చురుకుదనంతో, చొరవతో మళ్లీ ప్రకాశింపచేయగలుగుతున్నారని చెప్పడానికి ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ లో వైఎస్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం అంటే వైసీపీకి ఆ బ్రాండ్ ఇమేజ్ దూరమైనట్లే అవుతుంది. అదే జరిగితే ఇక జగన్ నాయకత్వంలోని వైసీపీకి వైఎస్ బ్రాండ్ తో పాటు ప్రజాదరణ దూరం అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.