ఫిబ్రవరి 2 నుంచి కోడికత్తి శ్రీను తల్లి పాదయాత్ర
posted on Jan 30, 2024 @ 9:36AM
ఐదేళ్లుగా బెయిలుకు కూడా నోచుకోకుండా జైల్లో మగ్గుతున్న కోడి కత్తి శీను విడుదల కోసం అతడి తల్లి పాదయాత్రకు సిద్ధమయ్యారు. వృద్ధాప్యంలో కూడా కుమారుడి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నకోడికత్తి శీను తల్లి తన కుమారుడు జగన్ కోసం జైలుకు వెళ్లాడని, అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన కుమారుడు బయటకు రాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని గడపగడపకూ వివరిస్తామంటూ కోడికత్తి శీను తల్లి సావిత్రమ్మ వచ్చే నెల 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సంకల్పించారు. కోనసీమ జిల్లా ఠానే లంక నుంచి ఆమె తన పాదయాత్ర ప్రారంభించనున్నారు. కోడికత్తి కేసులో బాధితుడినని చెప్పుకుంటున్నజగన్ కోర్టుకు హాజరై కేసులో సాక్ష్యం చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో అరెస్టైన శ్రీను అప్పటి నుంచీ జైల్లోనే మగ్గిపోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు ఇటీవల నిరాహారదీక్షకు దిగారు. అయితే దీక్షకు పోలీసుల అనుమతులు లేవంటూ అడ్డకోవడంతో విజయవాడలోని ఇంట్లోనే నిరశన దీక్ష చేపట్టారు. ఆ సందర్భంగా శ్రీను తల్లి సావిత్రి మాట్లాడుతూ... తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు. ఈ కేసులో బాధితుడిగా జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని సావిత్రమ్మ కోరారు. అదే సమయంలో విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు దిగారు.
కోడికత్తి కేసు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు అంటే 2018లో జరిగింది. తన పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ బయలు దేరే ముందు విశాఖపట్టణం ఎయిర్ పోర్ట్ లో ఈ దాడి జరిగింది. ఇది జగన్ పై జరిగిన దాడి కాదు అప్పటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడ అని రాజకీయ పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. ఆ దాడిని సానుభూతిగా మలచుకుని అప్పటి ఎన్నికలలో జగన్ విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే తనకు అంత సానుభూతి రావడానికి కారణమైన కోడికత్తి శీను జైల్లో మగ్గడమే తనకు ప్రయోజనం అని భావిస్తున్న జగన్ కోడికత్తి శీనుకు బెయిలు రాకుండా చేస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా జగన్ కోర్టకు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప కోడికత్తి శీనుకు బెయిలు వచ్చే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోడికత్తి కేసులో ఎటువంటి కుట్రా లేదని నిర్ధారించినా, మరింత లోతైన దర్యాప్తు కావాలంటూ జగన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే జైల్లో శ్రీను, బయట అతడి తల్లి సావిత్రమ్మ నిరాహారదీక్షకు దిగితే పోలీసులు భగ్నం చేశారు. దీంతో తన కుమారుడికి, తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని గడపగడపకు వివరించేందుకు కోడికత్తి శీను తల్లి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమయ్యారు.