సీబీఐ కిచ్చిన వాంగ్మూలంతో తెలుగుదేశం పార్టీకి షర్మిల క్లీన్ చిట్!
posted on Nov 7, 2022 @ 10:11AM
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు వెనుక ఉన్న చిక్కుముడులు విడివడుతున్న సంకేతాలు గోచరిస్తున్నాయి. మూడేళ్ల తరువాతైనా ఈ కేసులో నిందితులు ఎవరన్నది బయటపే సూచనలు కనిపించడానికి వివేకా కుమార్తె డాక్టర్ సునీత అలుపెరుగని న్యాయ పోరాటం ఒక కారణమైతే.. మరో కారణం మాత్రం కచ్చితంగా వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలేననడంలో సందేహం లేదు. ఈ కేసులో షర్మిల ఢిల్లీ వెళ్లి మరీ వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసులో నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెడుతుండటమే కాదు.. తాడేపల్లిలోని జగన్ ప్యాలస్ కూడా షేక్ అవ్వడం మొదలైందని అంటున్నారు. షర్మిల వాంగ్మూలంతోనే వివేకా హత్య కేసు వెనుక కుటుంబ కలహాలు, రాజకీయ నేపథ్యం ఉన్నాయన్న విషయం నిర్ధారణ అయ్యిందని కూడా చెబుతున్నారు.
షర్మిల వాంగ్మూలం కారణంగానే వివేకా హత్య కేసు సూత్రధారులు, పాత్రధారులు కూడా తప్పించుకోలేకుండా ఇరుక్కోవడం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ హత్య కేసు విచారణను రాష్ట్రం బయట జరపడానికి సుప్రీం సూత్ర ప్రాయంగా అంగీకరించడంతో విచారణ వేరే రాష్ట్రానికి మారడం ఖాయమనీ, అప్పుడు ఇప్పట్లా కడప జిల్లా పులివెందులలో దర్యాప్తునకు ఆటంకాలు కలిగించినట్లు కలిగించడం సాధ్యం కాదనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వివేకా హత్య కేసులో గుండె పోటు.. నరాసుర రక్త చరిత్ర వంటి వైసీపీ వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని ఇప్పటికే తేలిపోయిన నేపథ్యంలో.. అప్పట్లో అటువంటి వార్తలు మీడియాలో రావడానికి వెనుక ఉన్న కారణాలు, వ్యక్తుల గుట్టు కూడా రట్టయ్యే పరిస్థితి షర్మిల వాంగ్మూలంతో ఏర్పడిందని చెబుతున్నారు.
షర్మిల వాంగ్మూలం వివేకా హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి క్లీన్ చిట్ ఇవ్వడంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో తన సొంత అన్న జగన్, ఆయన ప్రభుత్వాన్ని షర్మిల వాంగ్మూలం షేక్ చేసేసిందని అంటున్నారు. వైసీపీ శ్రేణులే షర్మిల చెప్పినవే వాస్తవాలు అయి ఉంటాయని భావించే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక ప్రజలు కూడా షర్మిల మాటలనే విశ్వసిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. షర్మిల వాంగ్మూలం ఇప్పటికే వైసీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేసిందనీ, ఇక విచారణ జరిగి దోషులను చట్టం ముందుకు తీసుకురావడం అన్నది కోర్టులు, దర్యాప్తు సంస్థలు చేయాల్సిన పని అని జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో జనం బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో సీబీఐకి షర్మిల ఇచ్చిన వాంగ్మూలంతో వైసీపీ రాజకీయంగా డిఫెన్స్ లో పడింది.
అందుకు నిదర్శనం షర్మిల వాంగ్మూలం మీడియాలో వచ్చిన తరువాత కూడా వైసీసీ వర్గీయుల నుంచి ఇంత వరకూ ఎటువంటి స్పందనా రాకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు.. కడప ఎంపీ సీటు కోసమేనని షర్మిల మీడియా ముఖంగా ప్రకటించిన తరువాత కూడా వైసీపీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీనినే పరిశీలకులు వైసీసీ ఆత్మరక్షణలో పడిందనడానికి తార్కానంగా చెబుతున్నారు.
షర్మిల తాజాగా వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి ఉన్నారన్నది తన అనుమానం అంటూ సీబీఐ ముందు వాంగ్మూలం ఇచ్చినట్లుగా లీక్ అవ్వడంతో వైసీపీ మైండ్ బ్లాక్ అయినట్లు కనిపిస్తోంది. షర్మిల వాంగ్మూలంతో తెలుగుదేశం ఇంత కాలం భరిస్తూ వచ్చిన ఆరోపణలను నుంచి పూర్తిగా విముక్తి పొందిందన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
వివేకా కూతురే కాకుండా.. జగన్ కు స్వయానా తోడబుట్టిన సోదరి కూడా తన చిన్నాన్న హత్యలో ఎవరున్నారో వెల్లడించిన నేపథ్యంలో, జగన్ హత్యా రాజకీయాల చరిత్రను గమనించాలంటూ, టీడీపీ విమర్శల దాడి ప్రారంభించింది. షర్మిల వాంగ్మూలంపై దమ్ముంటే మాట్లాడాలని ఏకంగా జగన్ కే సవాల్ విసిరింది.
అయినా జగన్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. నిజానికి తన వాంగ్మూలంతోనే వివేకా హత్య పూర్తిగా కుటుంబంలో రాజకీయ ఆకాంక్షల కారణంగా జరిగిందనీ, ఈ హత్య వెనుక ఉన్నది కుటుంబానికి చెందిన వారేననీ షర్మిల విస్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు వైసీపీలో ఎవరైనా సరే ఈ హత్య వెనుక టీడీపీ ఉందని ఎదురుదాడి చేద్దామనుకున్నా, చేయాలనుకున్నా జనం నమ్మరని తెలియడంతోనే ఆ పార్టీ మౌనాన్నే ఆశ్రయించిందని పరిశీలకులు అంటున్నారు.
పైగా ఇదంతా జగన్ కుటుంబ వ్యవహారం, ఇందులో తలదూర్చి మాట్లాడాల్సిన అవసరం మాకేమిటని కూడా కొందరు వైసీపీ నేతలు ప్రైవేటు సంభాషణల్లో చెబుతున్నారు. మొత్తం మీద షర్మిల వాంగ్మూలం జగన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసిందన్నది మాత్రం కాదనలేని వాస్తవమని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.అలాగే వివేకా హత్య విషయంలో తమ పార్టీ టీడీపీపై వేసిన ఆరోపణలన్నీ శుద్ధ అబద్ధాలని కూడా ప్రజలలో ఒక అభిప్రాయం ఏర్పడిపోయిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.