ప్రభుత్వాలు మారితే పేర్లు కూడా మార్చాలా?
posted on May 31, 2014 @ 9:31AM
శంషాబాద్ విమానశ్రయం పేరు మార్చేందుకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించారు. కానీ కాంగ్రెస్, తెరాస పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నాయి. ప్రభుత్వాలు మారగానే విమానాశ్రయాలు, రోడ్లు, భవనాలు, బ్రిడ్జిల పేర్లు మార్చుకొంటూ వెళితే అదొక వికృత సాంప్రదాయానికి బీజం వేసినట్లవుతుంది. సంస్థలకు, జిల్లాలకు మహనీయుల పేర్లను పెట్టడం హర్షణీయమే, కానీ దానిని మరొకరు వచ్చి తొలగిస్తే అది చాలా అవమానకరంగా ఉంటుంది. అది వారి గౌరవానికి భంగం కలిగించడమే కాక వారిని అభిమానించే ప్రజల మనసులు కూడా నొచ్చుకొంటాయి. అందువలన స్వర్గీయ యన్టీఆర్ పుట్టిపెరిగిన కృష్ణా జిల్లాలోనే ఏర్పాటు చేయబోతున్న అంతర్జాతీయ విమానశ్రయానికి ఆయన పేరు పెడితే అందరూ హర్షిస్తారు కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ సహచరులకు కూడా ఇటువంటి సూచనే చేసారు. గత ప్రభుత్వ హయంలో పెట్టిన పేర్లను మార్చే ప్రయత్నం చేయవద్దని, ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే సంస్థలు, నిర్మించబోయే భవనాలకు ప్రజాభీష్టం మేరకు పేర్లు పెట్టడం మంచిదని సూచించారు. అందువల్ల శంషాబాద్ విమానాశ్రయం పేరు మార్చే ఆలోచనను కూడా విరమించుకొంటే మంచిది.