బైర్రెడ్డి రాజకీయభవిష్యత్తు ఏమిటీ? టీజీ సాయంతో కాంగ్రెస్ నీడన చేరుతారా?
posted on Oct 4, 2012 8:29AM
రాయలసీమను ప్రత్యేకరాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండుతో అనంతపురం నుంచి యాత్ర ప్రారంభించిన రాయలసీమహక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ బైర్రెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ భవిష్యత్తు డోలాయమానంలో పడిరది. ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి పదివిలో ఇంత వరకూ కొనసాగారు. అయితే తమ పార్టీ అధినేత చంద్రబాబు మీకోసం వస్తున్నా యాత్ర ప్రారంభించే రోజునే తానూ యాత్ర ప్రారంభించాలని బైర్రెడ్డి నిశ్చయించుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఈయన్ని వదిలేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ విషయం ముందుగా తెలుసుకున్న బైర్రెడ్డి తాను ముందుగా రాజీనామా పంపించారు. కనీసం రాయలసీమ ప్రత్యేకరాష్ట్రం కోసం రాజీనామా చేశానని చెప్పుకోవటానికి రాజశేఖరరెడ్డి ఇది అవకాశంగా తీసుకున్నారు. ఈ అవకాశం వల్ల తాను తెలుగుదేశం పార్టీకి దూరమైన విషయం బైర్రెడ్డికి తెలుస్తూనే ఉంది. అయితే ఆయన్ని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ దశలో రాయలసీమ ప్రాంతానికి చెందిన చిన్న, భారీనీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ కూడా బైర్రెడ్డి మాదిరిగా సీమ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గొంతు విప్పారు. తనతో పాటు రెండో గొంతు కలిపిన మంత్రి వెంకటేష్ రాయలసీమ హక్కుల వేదిక నేత కూడా అవటంతో బైర్రెడ్డిని ఆయనే కాంగ్రెస్‌పార్టీలోకి తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మంత్రి వెంకటేష్ సీమకు ప్రత్యేకప్యాకేజీ కావాలని డిమాండు చేస్తున్నారు. దీంతో ఒకరకంగా కాంగ్రెస్‌కు బైర్రెడ్డి దగ్గరైనట్లు వాతావరణం కనిపిస్తున్నా మరోవైపు మొత్తం సీమపై పట్టుసాధించాలంటే కొంత కాలం తన రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టాలని ముఖ్యసలహాదారులు ఆయనకు సలహా ఇచ్చారట. ఈ సలహా వల్ల ఆయన ఎంత వరకూ కాంగ్రెస్‌కు దగ్గరవుతారన్నది ఇప్పుడే తేల్చలేకపోతున్నారు. కానీ, తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాక మరో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.