వైఎస్సాఆర్ కాంగ్రెస్ మీద చంద్రబాబు ఛలోక్తులు
posted on Oct 4, 2012 8:31AM
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు హుషారొచ్చింది. మీకోసం వస్తున్నా 117రోజుల యాత్రలో భాగంగా బాబు అనంతపురం జిల్లాలో పర్యటిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని పిల్ల కాంగ్రెస్ అని వ్యంగ్యోక్తిని వదిలారు. అసలే పాదయాత్రలకు మద్దతు కూడగడుతున్నారని తెలిసి అప్రమత్తమవుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని తన వ్యంగ్యోక్తి ద్వారా బాబు నిద్ర లేపినట్లు అయింది. ఈ పాదయాత్రను ఎదుర్కోవాలి అని ఆ పార్టీ ఇప్పటికే సన్నాహాలు చేసుకుంటోంది. ఆ విషయం తెలియని బాబు పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు వ్యంగ్యోక్తులు, ఛలోక్తులు అప్పటికప్పుడు వదులుతున్నారు. మరి ఎంఎ పాలిటిక్స్ చదివిన చంద్రబాబు అకస్మాత్తుగా పరిస్థితిని బట్టి విమర్శలను మార్చటంలో దిట్ట అని ఎప్పటి నుంచో పేరు గడించారు కదా! అయితే ఈ విమర్శలను, వ్యంగ్యోక్తులను వదిలేటప్పుడు పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుండేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. తమ వంటి పిల్ల కాంగ్రెస్ లేకపోతే ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ చేతిలో దారుణమైన ఓటమిని బాబు చవిచూడాల్సి వచ్చేదని గుర్తుంచుకోవాలని వారు కోరుతున్నారు. 17అసెంబ్లీ స్థానాలకు 15స్థానాలు సాధించుకున్న తాము పిల్లకాంగ్రెస్ అయితే వెన్నుపోటు ద్వారా అధికారం కైవసం చేసుకున్న బాబు మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యక్షంగా బాబు ప్రసంగాలపై అప్పటికప్పుడే సమాధానం ఇచ్చేందుకు వైకాపా సిద్ధమవుతోంది.