ఆప్షన్ వెదుకున్న కేసిఆర్?
posted on Oct 4, 2012 8:26AM
దారులన్నీ మూసుకుపోయాయనుకున్నప్పుడు ఏదో ఒక ఆప్షన్ దొరికితేనే జనంలోకి వెళ్లగలమని నేతలకు బాగా తెలుసు. అటువంటి ఆప్షన్ వెదుక్కోవటంలో కొందరు సిద్ధహస్తులుంటారు. మరికొందరు ముందుగా మాటపడి తరువాత తమ తడబాటును కప్పిపుచ్చుకోగలుగుతారు. అటువంటి కోవలోకి తెలంగాణా రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్) అధినేత కే చంద్రశేఖరరావు(కేసిఆర్) కూడా చేరారు. అసలు ఆయన అనుకున్నట్లు కాంగ్రెస్ అధిష్టానం కనుక తెలంగాణా ప్రత్యేకప్రతిపత్తి ప్రకటించేసి ఉంటే ఇప్పుడు తన ప్రాంతంలో రారాజులా తిరగగలిగేవారు. అయితే అధిష్టానం తమ స్పందనను తెలియజేయకపోవటంతో కేసిఆర్ తన ఇంటికి అత్యవసరపనులపై వెళ్లాల్సి వస్తోంది కాబట్టి మరోదారి వెదుక్కున్నారు. కలవాల్సిన వారికన్నా ఎక్కువమందినే కలిశానని ప్రకటించేసుకున్నారు. దానికి కొనసాగింపుగా ఇంకోసారి తెలంగాణాపై చివరాఖరి చర్చ జరిగి కాంగ్రెస్ నుంచి ప్రకటన వెలువడుతుందని సర్దిచెప్పారు. అదేంటి ఇంతకాలం ఢల్లీలో కేసిఆర్ ఏమి చేశారని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండానే కలవాల్సిన వారి కన్నా ఎక్కువ కల్సానని చెప్పుకొచ్చారు. అంటే తన సొంత ఊరికి వెళ్లటానికి ఉన్న అడ్డంకులను కేసిఆర్ తెలివిగా రెండు వాక్యాల ప్రకటన ద్వారా తప్పించారన్న మాట. ఒకవేళ తాను మళ్లీ ఢల్లీ వెళ్లాల్సి వచ్చినా చర్చలు అని చెప్పటానికి రెండో వాక్యం వదిలారన్న మాట. అంటే ఇంతకాలం అసలు స్పందించాల్సిన వారు స్పందించలేదన్న మాట కేసిఆర్ ఎంత తెలివిగా సర్దుకున్నా బయటపడిపోతోంది. అయితే కేసిఆర్‌ను తప్పుపట్టిన తెలంగాణా నేతలు ప్రొఫెసర్ కోదండరామ్, విమలక్క తదితరులను టిఆర్‌ఎస్ నేతలు వెలివేసేందుకు సైతం సిద్ధపడ్డారు. అందువల్ల కేసిఆర్ ఆదరణకు లోటు లేదు. మరోసారి అవసరమైతే ఆయన ఆప్షన్ వెదుక్కోవచ్చు కూడా.