దెయ్యం సెల్ఫీ!
posted on Mar 31, 2016 @ 4:59PM
హైజాకరుతో సెల్ఫీ, శవాల ముందు సెల్ఫీ, రైలు ముందు పరిగెడుతూ సెల్ఫీ... ఇలా సెల్ఫీ దిగేందుకు జనం రకరకాల సందర్భాలు వెతుక్కుంటున్న విషయం తెలిసిందే! ఈ సంబరంలో ఒకసారి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతున్నాయి. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో షికారు చేస్తున్న ఓ సెల్ఫీ మరీ విచిత్రంగా ఉంది. ఇందులో సెల్ఫీ దిగుతున్న ఓ జంట ఫొటో ఉంది. సవాలక్ష సెల్ఫీలలాగానే ఇది కూడా ఓ సాదాసీదా దృశ్యం అనుకున్నవారి వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా, ఆ సెల్ఫీలోని స్త్రీ ప్రతిబింబం తేడాగా కనిపించింది.
ఇటు కెమెరా వంకా, అటు వెనక్కి తిరిగి కూడా ఆ యువతి చూస్తున్నట్లు సెల్ఫీలో ఉంది. ఇది స్పష్టంగా ఫొటోషాప్‌తో రూపొందించిన చిత్రం అని తెలుస్తున్నా... దెయ్యంతో సెల్ఫీ అంటూ సోషల్ మీడియా జనం తెగ హడావుడి చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎంత సరదాకైతే మాత్రం తోటి మనిషిని ఇలా చూపిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ఆ సెల్ఫీలో ఉన్నదెవరో ఎవరికీ తెలియదు కాబట్టి, మరిన్ని వివరాలు తెలిసే అవకాశం లేదు!