ద్వివేది, గిరిజాశంకర్‌లను కనికరించిన ఎస్ఈసి నిమ్మగడ్డ
posted on Feb 3, 2021 @ 9:45AM
ఎపి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను ధిక్కరించి.. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు నడుచుకున్న పంచాయత్ రాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజాశంకర్‌ల పై ఎస్ఈసి అభిశంసన చర్యలు చేపట్టాలని అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు కేంద్రంలోని డీవోపీటీకి సిఫారసు చేసారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఈసీ సిఫారసులను వెనక్కు పంపింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరు ఉన్నతాధికారులతో స్వచ్చంద పదవీ విరమణ చేయించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ సిఫారసు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం నిమ్మగడ్డ తాజాగా డీవోపీటికి రాసిన లేఖతో బయట పడింది.
దేశంలో ఉన్న మొత్తం సివిల్ సర్వీస్ అధికారుల వ్యవహారాలను కేంద్ర ప్రభుత్వంలోని డీవోపీటీ పర్యవేక్షిస్తుంది. అయితే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహించి.. కొత్త ఓటరు జాబితాను ఉద్దేశపూర్వకంగా ప్రచురించకుండా నిర్లక్ష్యం చేసి దేశ ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీన పరిచే ప్రయత్నాలను ద్వివేదీ, గిరిజాశంకర్ చేశారని.. వీరిది క్షమించరాని నేరమని పేర్కొంటూ వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసి డీవోపీటికి సిఫారసు చేశారు. ఆ చర్యలలో ఒకటి అభిశంసన కాగా.. రెండోది నిర్బంధ పదవీ విరమణ. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా వ్యవహరించి ఆ ఇద్దరు అధికారులు చిక్కుల్లో పడ్డారు. దీంతో ఎస్‌ఈసీకి అధికారం లేదని ఎపి సీఎస్ నిమ్మగడ్డకు లేఖలు రాసారు.
మరోపక్క ఎన్నికల నిర్వహణలో ఆ అధికారులు కనుక సక్రమంగా పని చేస్తే… వారిపై చేపట్టిన చర్యల సిఫార్సులను వెనక్కి తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని నిమ్మగడ్డ కొద్ది రోజుల కిందట చెప్పారు. దీంతో వారు ఎన్నికల నిర్వహణలో గతంలోలా కాకుండా ఎస్ఈసి ఆదేశాలను పాటిస్తూ పనిచేస్తూండటంతో … నిర్బంధ పదవీ విరమణ సిఫార్సుల్ని వెనక్కి తీసుకుంటూ నిమ్మగడ్డ డీవోపీటికి లేఖ రాశారు. దీంతో ఇంకా మూడేళ్ల సర్వీసు ఉన్న ద్వివేదీ.. అంత కంటే ఇంకా ఎక్కువ సర్వీసు ఉన్న గిరిజాశంకర్ ల పరిస్థితి అయోమయంలో పది ఉండేది. అయితే ఇప్పటికీ అభిశంసన చర్యలు మాత్రం ఎదుర్కోనున్నారు. మరోపక్క ఈ వ్యవహారం ఎపిలో పని చేస్తున్న సివిల్ సర్వీస్ అధికారుల్లో కలకలం రేపుతోంది.