కరోనాను జయించిన ఢిల్లీ! 56.1 శాతం మందిలో హెర్డ్ ఇమ్యూనిటీ
posted on Feb 3, 2021 @ 9:53AM
కరోనా మహమ్మారితో అల్లాడిన దేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు వైరస్ ను జయించింది. కరోనాపై పోరాటం దిశలో అద్భుత విజయం సాధించింది ఢిల్లీ. ఢిల్లీ ప్రజల్లోని ప్రతి ఇద్దరిలో ఒకరికి వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయి. తాజాగా నిర్వహించిన సీరో సర్వేలో ఢిల్లీలోని 56.1 శాతం మంది శరీరంలో యాంటీ బాడీల వృద్ధి కనిపించిందని వెల్లడైంది. ఢిల్లీ వాసుల్లో సగం మందికి పైగా కరోనా బారిన పడి ఏ విధమైన మందులు తీసుకోకుండానే కోలుకున్నారని సీరో సర్వేలో తేలింది. అంతకుముందు జరిగిన సీరో సర్వేలో 49 శాతం హెర్డ్ ఇమ్యూనిటీ ఏర్పడినట్టు తేలగా, ఇప్పుడది మరో 8 శాతానికి పైగా పెరగడం గమనార్హం.
సౌత్ ఈస్ట్ ఢిల్లీ వాసుల్లోని 62.2 శాతం మందిలో కరోనా యాంటీ బాడీలు ఉండగా, నార్త్ ఢిల్లీ ప్రజల్లో 49.1 శాతం మందిలో యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని సీరో సర్వే వెల్లడించింది. ఏ ప్రాంతంలోనైనా ఓ వ్యాధి ప్రబలితే.. 50 శాతానికి పైగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిన తరువాతే దాని వ్యాప్తి నియంత్రణలోకి వచ్చినట్టని వైద్యశాఖ నిర్దారిస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో 56.1 శాతం మందిలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి.. ఢిల్లీ కరోనా మహమ్మారిని జయించినట్టేనని ఎయిమ్స్ వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీలో హెర్డ్ ఇమ్యూనిటీ గణనీయంగా పెరిగిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. కరోనా విషయంలో ఢిల్లీ కీలక మైలురాయిని అధిగమించి, విజయం సాధించిందని వ్యాఖ్యానించారు. అయినా ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని, అశ్రద్ధ వహించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో తొలి సీరో సర్వే జూలైలో జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెలా ఈ సర్వే జరుగుతుండగా, తొలుత 22.8 శాతంగా ఉన్న హెర్డ్ ఇమ్యూనిటీ క్రమంగా పెరుగుతున్నట్టు తేలింది.