సీబీఎన్ మీకు సెల్యూట్.. ఇదికదా గెలుపంటే!
posted on Sep 7, 2024 6:04AM
ఆయనో రాజకీయ చాణుక్యుడు.. ఆర్థిక వేత్త.. ఐటీ రంగ నిపుణుడు.. టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్.. ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు.. కష్ట కాలంలో అండగా నిలిచే పెద్దన్న.. మొత్తంగా ఆయన ప్రజల మనిషి.. ప్రజా నాయకుడు. ఇంకా చెప్పాలంటే.. ఏపీ ప్రజల క్షేమం కోసం ఎంతదూరమైనా వెళ్లే జననేత. ఏపీని తాకిన ఎలాంటి ఉపద్రవమైనా సీఎం కుర్చీలో ఆయన ఉన్నాడంటే తోక ముడవాల్సిందే.. ఆయనే ఎవరో కాదు.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఆయన అభినుమాలు, టీడీపీ శ్రేణులు మాటలే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాంతరాళాలలోంచి గర్వంగా వస్తున్న పలుకులు.
మరోసారి ఆ మాటలు అక్షరసత్యాలయ్యాయి. చంద్రబాబు సీఎం సీటులో ఉంటే.. ఏపీ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగించొచ్చని మరోసారి రుజువైంది. గతంలో విశాఖ.. నేడు విజయవాడ. ప్రకృతి ప్రకోపానికి ఎదురొడ్డి నిలబడ్డారు ఆ 74ఏళ్ల నవ యువకుడు. విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలకు తన ప్రాణాలను అడ్డుగా పెట్టి అండగా నిలిచాడు. బాధితులంతా వరద ముంపు నుంచి బయటకు వచ్చేవరకూ తానూ ఓ వరద బాధితుడాగా గడిపారు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా, నిద్రాహారాలన్న ఊసే ఎత్తకుండా వరదల్లో బోట్లపై విస్తృత పర్యటనలు సాగించి బాధితుల్లో దైర్యాన్ని, స్థైర్యాన్ని నింపారు.. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. దీంతో మొన్నటి ఎన్నికల్లో సాధించిన విజయం కంటే.. ఉగ్రరూపందాల్చిన కృష్ణమ్మను శాంతింప జేసి చంద్రబాబు సాధించిన విజయం వంద రెట్లు గొప్పది.
ఏపీ ప్రజలకు మొదటి నుంచి సీఎం చంద్రబాబుపై అపార నమ్మకం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, నవ్యాంధ్రప్రదేశ్ లోనూ అయిన చంద్రబాబు సీఎం కుర్చీలో ఉంటే మన కష్టాలు తీరుతాయన్న నమ్మకం ప్రజల్లో ఉంటుంది. అందుకే.. ఏపీ ఎప్పుడు కష్టాల్లో కూరుకుపోయినా జనం చంద్రబాబు వైపే చూస్తారు. చంద్రబాబు కూడా ఎన్నికలలో జయాపజయాలను పట్టించుకోకుండా నాలుగు దశాబ్దాలుగా మచ్చలేని చంద్రుడిలా ప్రజాజీవితంలో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు అద్భుతాలు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ వైపు ప్రపంచం చూసేలా చేశాడు. రాష్ట్ర విభజన తరువాత పేరు తప్ప మరేం మిగలని విభజిత ఆంధ్రప్రదేశ్ ను అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టి ప్రపంచం మొత్తం ఏపీవైపు చూసేలా చేయాలని చంద్రబాబు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. మధ్యమధ్యలో ఎదురైన ప్రకృతి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ.. ప్రజలకు నేనున్నానని భరోసా కల్పిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు చంద్రబాబు నాయడు.
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరదలు వచ్చిన సమయంలో.. ఏ ముఖ్యమంత్రి అయినా వరదల తీవ్రతను గమనించేందుకు ఏరియల్ సర్వే చేస్తారు. లేకుంటే అధికారులను, ప్రజాప్రతినిధులను అలర్ట్ చేస్తూ బాధితులకు అండగా నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. గతంలో వైసీపీ హయాంలో పలు సందర్భాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కాలు కింద కూడా పెట్టలేదు. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, సీఎం చంద్రబాబు నాయుడు అలాకాదు. భారీ వర్షాలు, వరదలతో ముంపుకు గురైన ప్రాంతాల్లోకి నేరుగా వెళ్తారు.. పీకల్లోతు నీళ్లున్నా పట్టించుకోరు.. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పిస్తారు. గతంలో విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన విలయం అంతాఇంతా కాదు.. ఆ తుఫాన్ రక్కసి ధాటికి సర్వం కోల్పోయిన ప్రజలు తల్లడిల్లిపోయారు. అలాంటి సమయంలో ప్రజలకు కావాల్సిన భరోసా ఇవ్వడమే కాదు. నేనున్నానంటూ చంద్రబాబు కొండంత అండగా నిలిచారు. నాలుగు గోడల మధ్య కూర్చొని సమీక్షలు చేయడం కాదు బస్సులోనే మకాం పెట్టి మరీ బాధితులకు భుజం కాశారు. వరద ప్రాంతాల్లో విస్తృత పర్యటనలుచేస్తూ బాధితుల్లో మనోధైర్యం నింపి బతుకుపై ఆశను నింపారు. అధికారులను పరుగులు పెట్టించి మరీ కూలబడిపోయిందనుకున్న ప్రాంతాన్ని తిరిగి నిలబెట్టారు. నెలల వ్యవధిలో తుపాను గాయాన్ని తుడిచి విశాఖకు పూర్వవైభవం తీసుకొచ్చారు.
అప్పట్లో విశాఖ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితి.. ప్రస్తుతం విజయవాడ ప్రజలకు ఎదురైంది. కుండపోత వర్షానికి తోడు.. కృష్ణానదికి రికార్డు స్థాయిలో వచ్చిన వరద, బుడమేరు ముంపుతో విజయవాడలోని అనేక ప్రాంతాల్లోకి మనిషి లోతు వరద నీరు చేరింది. ఇళ్లు నీటమునిగాయి. ప్రజలు భయంతో వణికిపోయారు. వెంటనే రంగంలోకి దిగిన చంద్రబాబు నాయుడు.. నేనున్నాను మీకేం కాదు అంటూ వరద బాధితుల్లో భరోసా కల్పించేందుకు వరద నీటిలోకి దిగారు. బోటులో ముంపు ప్రాంతాలలోకి వెళ్లారు. పొక్లెయిలో ప్రయాణించి మరీ ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటనలు చేశారు. అధికారులను, ప్రజాప్రతినిధులను ఉరుకులు పరుగులు పెట్టించి తక్షణమే ఆహార ప్యాకెట్లు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. వరద బాధితులకు భరోసా ఇచ్చారు. తమను ఆదుకోవడానికి చంద్రబాబు ఉన్నారన్న ధైర్యాన్నిచ్చారు. ఆయన వచ్చారు ఇక భయం లేదు వరద ముంపు నుంచి సురక్షితంగా బయటపడతాం అనే ధీమాను కల్పించారు. ఐదు రోజులు నిర్విరామంగా వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందించ డంతోపాటు.. వరద ముంపు నుంచి బయటపడిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చురుగ్గా జరిగేలా చర్యలు తీసు కున్నారు. గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రీ చేయని రీతిలో బురదతో నిండిపోయిన బాధితుల ఇళ్లను క్లీన్ చేయించే బాధ్యతను తీసుకున్నారు. 74ఏళ్ల వయస్సులో విజయవాడలో వరద బాధితులను కాపాడుకునేందుకు చంద్రబాబు పడిన కష్టాన్నిచూసి తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు.. దేశవ్యాప్తంగా ప్రజలు చంద్రన్నా సెల్యూట్ అంటున్నారు.