హైపర్ ఆదికి రోజా సపోర్ట్
posted on Jan 21, 2023 5:06AM
పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జగన్ మీద పోటీకి సిద్ధం .. హైపర్ ఆది.. ఇంతకీ ఈ హైపర్ ఆదీ ఎవరు? చాలామందికి తెలియక పోవచ్చును కానీ, ఓ ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే ... ఓ బూతు కామెడీ షో చూసే వారికి మాత్రం ఇతగాడి పరిచయం అవసరం లేదు. సరే .. ఇప్పుడు విషయం అదికాదు కాబట్టి, ఆవిషయాన్ని పక్కన పెట్టి, విషయంలోకి వస్తే... ఈ ఆది అనే వాడు... జనసేన వేదిక నుంచి పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ ప్రభత్వం పై సెటైర్లు, పంచ్ డైలాగులతో విరుచుకు పడ్డారు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే, జగన్ మీద పోటీకి సిద్ధం, అంటూ జగన్ రెడ్డి ఇమేజ్ మొత్తాన్ని బెలూన్ లో గాలిలా కామెడీగా తీసి పారేశారు. మరో కమెడియన్, ఏపీ సర్కార్ లో ఉన్నశతకోటి సలహాదారుల్లో .. మరో సలహదారు అలీ, ఇటీవల జగన్ రెడ్డి ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తానని చేసిన కామెంట్ కు కౌంటర్ గా ఆది ఈ వ్యాఖ్య చేశారు కావచ్చు.
అయినా, ఆది కామెంట్స్ మీద వైసేపీ నేతలు భగ్గుమంటున్నారు. కొంచెం చాలా తీవ్రంగానే హెచ్చరిస్తున్నారు. అతగాడి భాషలోనే సమాధానం ఇస్తున్నారు. కానీ మంత్రి రోజా మాత్రం, ఆది అమాయకుడు అంటూ కితాబు నిస్తున్నారు. జగన్ రెడ్డిని ఇంతవరకు ఎవరూ దూషించనంతగా దూషించడమే కాకుండా తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో తెలియని విధంగా తొడగొట్టి సవాలు విసిరిన ఆది ని నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు అంటూ మంత్రి రోజా సర్టిఫికేట్ ఇస్తున్నారు.
అయితే రోజా రియాక్షన్ చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఎవరైనా చిన్నమాట అంటేనే రెచ్చిపోయే రోజా అంతలేసి మాటలన్న ఆది విషయంలో ఎందుకిలా ‘చిన్నోడు’ ఏమీ తెలియని అమాయకుడు అంటూ చిరునవ్వుతో ఎందుకు సమర్ధించు కొచ్చారు? ఆ మాటలు అన్నది ఆది అయినా అనిపించింది, మెగా ఫ్యామిలీ అంటూ, ఊరుము ఉరిమి మంగలం మీద పడినట్లు చిరంజీవి ఫ్యామిలీ మీద ఎందుకు పడ్డారు? ఆదిని రక్షించే బాధ్యతను ఆమె ఎందుకు భుజాల మీద వేసుకున్నారు? ఎందుకు ఆదికి అండగా నిలిచారు? అంటే అందుకు మంత్రి రోజా పూర్వాశ్రయంలో, జబర్దస్త్ షో జడ్జిగా ఈ ఆది వేసిన జోకులకు పగలబడి నవ్వారు. ఆ విధంగా ఆ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ బంధం ఉంటే ఉండవచ్చని, అందుకే ఆమె, ఆది మీద ఆగ్రహాన్నిడైవెర్ట్ చేసేందుకే మెగా ఫ్యామిలీ మీద మండి పడుతున్నారనే టాక్ ఒకటి నడుస్తోంది.
చిరు ఫ్యామిలీ ఇండస్ట్రీలో చాలా మందిని నాశనం చేశారు, చిరు ఫ్యామిలీ మాట వినకుంటే సినిమా అవకాశాలు రావు, మెగా ఫ్యామిలీలో హీరోలకు వ్యతిరేకంగా మాట్లాడితే సినిమా ఇండస్ట్రీ లో ఏమి లేకుండా చేస్తారు. అందుకే ఆది లాంటి చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారంటూ చెప్పు కొచ్చారని అంటున్నారు. అయితే ఆది మరీ అంత అమాయకుడు కాదని, అతగాడికీ మంత్రి రోజా స్థాయిలో రాజకీయ కోరికలున్నాయని అంటారు. రణస్థలంలో ఇటీవల జనసేన నిర్వహించిన యువశక్తి సభలోనూ ఆది ఘాటుగా మాట్లాడారు. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ తరపున ప్రచారం కూడా చేశారు. అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చేందుకే ఆది అలా రెచ్చిపోయారని అంటున్నారు.
మరో వంక ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది.. సొంత జిల్లా నుంచే పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. దీంతో ప్రధానంగా రెండు నియోజక వర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిలో గిద్దలూరు నియోజకవర్గం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆది సొంత ఊరికి దగ్గరలోనే ఈ నియోజకవర్గం ఉంది. అక్కడ జనసేన పార్టీ కూడా బలంగా ఉందని జనసేన నేతలు చెబుతున్నారు.అయితే, పులివెందులలో జగన్ రెడ్డి పైనే పోటీకి సై అంటున్న ఆది..నగరిలో మంత్రి రోజా పై పోటీ అంటే ఏమంటారో .. సై ..అంటారా .. నై అంటారా? ఊ అంటారా.. ఊహూ అంటారా అటూ సోషల్ మీడియాలో పంచుల మీద పంచులు పడుతున్నాయ్ .. అయితే, రాజకీయాలు ‘జబర్దస్త్’ స్థాయికి పడిపోవడమే కొంచెం చాలా విచారం ... అనే బాధపడేవాళ్ళు బాధపడుతున్నారు.