రోహిత్.. పోలీసు.. సారీ, టీచర్!
posted on Aug 24, 2022 @ 1:08PM
పోలీసు పేరు వినగానే పిల్లలు భయపడతారు. రోడ్డు మీద, బస్టాండ్, రైల్వే ప్లాట్‌ఫారాల మీద అడుక్కు నే పిల్లలు మరీ భయపడి పారిపోతారు. వారి జీవనోపాధిని అడ్డుకుంటారని, వారని దొంగలుగా జమకట్టి జైల్లో వేస్తే తల్లినో, తండ్రినో ఎలా పోషించ డమన్న భయాందోళన ఎప్పుడూ ఉంటుంది. కానీ సికిం దర్‌పూర్ కరణ్ గ్రామంలో పిల్లలకు మాత్రం ఈ పోలీసాయనంటే అపారమైన భక్తి, గౌరవం. ఆయన ఝాన్సీకి ట్రాన్స్ర్ ఫర్ మీద వెళుతున్నాడని తెలిసి గొల్లుమన్నారు. అలాంటివాడు మళ్లీ దొరకడని.
రోహిత్ కుమార్ యాదవ్ ప్రభుత్వ రైల్వే పోలీసు. ఉత్తరప్రదేశ్ ఉన్నావ్‌లో ఆయన ఉద్యోగం. ఆయన కేవ లం పోలీసు ఉద్యోగంతో సరిపెట్టుకోలేదు. రోజూ చాలామంది అనాథపిల్లలు రోడ్లమీద, రైల్వేస్టేషన్ దగ్గరా అడుక్కుంటూ తిరగడం చూసి వీళ్లకి ఏదన్నా చేయాలని తలిచాడు. వాళ్లకి చదువు నేర్పితే కాస్తంతయి నా జీవితంలో నిలబడతారన్న ఆలోచన అమలు చేయాలనుకున్నాడు.
వెంటనే తను పనిచేసే రైల్వే స్టేషన్ పక్కనే హర్ హాథ్‌మే కలమ్ అనే పేరుతో చిన్న స్కూలు ఆరంభించాడు. అదీ తరగతి గదులు లేని స్కూలు. అంటే చెట్లకిందనే పాఠాలు చెప్పేవాడు. మొదట్లో ఒక్కరిద్దరు నిజంగా ఆసక్తి ఉన్న పిల్లలే చేరారు. వారు వాళ్ల స్నేహితుల్ని లాక్కొచ్చారట. దీనికి తోడు ఉచితంగా ఆయన పాఠాలు చెబుతున్నాడని తెలిసి కొంత ఆసక్తీ చూపారు. పైగా చేతిలో బెత్తం లేని టీచర్ ని చూస్తే ఎవరికయినా ఓకే కదా! అలా విద్యా ర్ధుల సంఖ్య పెరిగి చాలాకాలం అలా చెట్లకిందనే బోధించేవాడు ఈ పోలీసాయన. తన డ్యూటీ కాగానే వెంటనే టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెప్పేవాడు.
రోహిత్ చేస్తున్న పని ఆ గ్రామంలో పెద్దలకు ఎంతో నచ్చింది. పోలీసే కాదు ఇతనిలో మంచి టీచర్ కూడా ఉన్నాడన్నది గుర్తించారు. వారంతా మాట్లాడుకుని ఊళ్లో పంచాయితీ ఆఫీసే స్కూలుగా ఉపయోగించుకో మని అన్నారు. యాదవ్ ముందు కొంత సందేహించాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇలా వీరి సహాయం తీసుకోవడం ఎంతవరకూ సబబు అని. కానీ తన పై అధికారులకు అతని సంగతి తెలిసింది. ఫర్వాలేదు, పిల్లలకు పాఠాలు చెప్పడం గొప్ప వృత్తి కనుక అది కూడా చేయమని ప్రోత్సహించారు. అంతే పోలీసాయ న విజృంభించి మరింత బాగా పాఠాలు చెబుతూ విద్యార్ధుల సంఖ్యను పెంచగలిగాడు. చాలామంది అనాథ పిల్లలకు అతనే గురువు, దైవంగా మారాడు. వారి ప్రవర్తనలోనూ ఎంతో మార్పు రావడం గ్రామ పెద్దలూ గమనించారు. పోలీసాయనా.. శభాష్ అన్నారు.
రోహిత్ మాత్రం ఇదంతా తన తండ్రి వారసత్వమనే అంటాడు. రోహిత్ తండ్రి చంద్రప్రకాష్ యాదవ్ కూడా ఇటావా దగ్గర ముదయినా గ్రామంలో 1986లో ఓపెన్ ఎయిర్ స్కూలు నిర్వహించారు. ఆయన రైతుల పిల్లలకు చదువునేర్పుతుండేవారు. తండ్రివారసత్వంలో పెట్టిన స్కూలుకి వచ్చే విద్యార్ధులకు రోహిత్ యాదవ్ తన జీతంలో కొంత ఖర్చుచేసేవాడు. పిల్లలకు పుస్తకాలు, దుస్తులు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. పిల్లల్ని ఎంతో బాగా చూసుకోవడంతో అందరూ ఆయన్ను తండ్రిలా, అన్నలా భావించేవారు.
జూలై 16న ఝాన్సీకి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. దానికి సంబంధించి అధికారులు పంపిన ఆదేశాన్ని చూసి కొంత ఆనందించాడు, చాలా బాధపడ్డాడట! పిల్లలకూ ఈ సంగతి తెలిసి ఎంతో బాధ పడ్డారు. కానీ తప్పని పరిస్థితి. ముగ్గురు పిల్లల తండ్రి అయిన రోహిత్ తన జీవనానికి తప్పని స్థితిలో ఝాన్సీకి వెళుతున్నాననే అన్నాడు. పిల్లలు ఆనందించారు.