మా ఆయన రాబర్ట్ వాద్రా చాలా మంచోడు: ప్రియాంక
posted on Apr 22, 2014 @ 4:02PM
చాలా మంచోడయిన తన భర్త రాబర్ట్ వాద్రాను రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం కోసం ఆయన్ని అనవసరంగా తిట్టిపోస్తున్నాయని, చెడ్డవాడిలా చిత్రీకరిస్తున్నాయని సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తమీద రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న కామెంట్లు తనకెంతో బాధని కలిగిస్తున్నాయని ఆమె చెప్పారు.
రాజకీయ నాయకులు ఆధారాలు లేని ఆరోపణలతో తమ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ప్రియాంక అంటున్నారు. సోనియాగాంధీ పోటీ చేస్తున్న రాయబరేలిలో ప్రచారం నిర్వహిస్తున్న ప్రియాంక ఒక సభలో ఈతరహా ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తన భర్తని, తన కుటుంబాన్ని ఎంత బలహీనపరచాలని చూసినా తమ కుటుంబం అంత స్ట్రాంగ్ అవుతుందన్న ధీమాని ప్రియాంక వ్యక్తం చేశారు.
మా అమ్మ ఈ దేశంలో పుట్టకపోయినా ఆమెను ఈ దేశ ప్రజలు ఎంతో అభిమానిస్తున్నారు. ఈ దేశంలో వున్న గొప్పతనం ఇదే అని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో తాను తన తల్లి సోనియాగాంధీకి ఓటు వేయమని అడగనని, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఓటు వేయండని అడుగుతానని ప్రియాంక రాయబరేలి ఓటర్ల సెంటిమెంట్ మీద గురిచూసి కొట్టేలా మాట్లాడారు.