పవన్ మాటలు హత్తుకున్నాయి: మోడీ
posted on Apr 22, 2014 @ 4:29PM
నిజామాబాద్ లో బిజెపి నిర్వహించిన భారత్ విజయ ర్యాలీ బహిరంగసభలో మాట్లాడిన నరేంద్రమోదీ..తెలంగాణ ప్రజలకు ఈ ఎన్నికలకు చాలా కీలకమని గుర్తు చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వుండాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపైన వుందని మోడీ అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది ప్రాణాలు కోల్పోయారు... వాళ్ళ తల్లిదండ్రుల కడుపుకోతను తాము తీరుస్తామని మోదీ హామీ ఇచ్చారు.
టీఆర్ఎస్ పార్టీపైన మోదీ విమర్శలు గుప్పించారు. కుటుంబ రాజకీయాలు దేశానికి అరిష్టమని వ్యాఖ్యానించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పోటీ చేస్తుంటే నిలదేసే ధైర్యం లేదా అంటూ టీఆర్ఎస్‌పై పరోక్ష విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రజలను మోదీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చే సమయంలో తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిందని, అయితే తెలుగు స్ఫూర్తి, తెలుగు సంస్కృతి అనే తల్లిని మాత్రం చంపేసిందని విమర్శించారు.
ఆ సమయంలో తానెంతో బాధపడ్డానని, ఆ సమయంలో తనను పవన్ కళ్యాణ్ కలిశాడని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ని చూసి తనలో వున్న బాధ తగ్గిందని, పవన్ కళ్యాణ్ మాటలు తనను హత్తుకున్నాయన్నారు. పవన్ కళ్యాణ్ వంటి వారు తెలుగు స్ఫూర్తిని కాపాడగలరని పూర్తిగా విశ్వసిస్తున్నానని చెప్పారు.