అక్షయ తృతీయ రోజున భారీగా బంగారం చోరీ
posted on May 3, 2014 @ 2:58PM
అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే మంచి జరుగుతుందని, బోలెడంత డెవలప్ అవుతామని చాలామంది నమ్ముతారు. ఈ నమ్మకానికి కార్పొరేట్ బంగారు దుకాణాలు మరింత బలాన్ని చేకూరుస్తూ ప్రకటనలు ఇస్తూ వుంటాయి. తద్వారా తమ వ్యాపారాన్ని పెంచుకుంటూ వుంటాయి. బంగారం కొనడానికి వచ్చినవారి జేబులు ఖాళీ చేస్తుంటాయి. అది వేరే విషయం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటేనే కాదు.. కొట్టేసినా మేలు జరుగుతుందని మహారాష్ట్రలోని థానేలో కొంతమంది దొంగలు భావించినట్టున్నారు. అందుకే కరెక్ట్ గా అక్షయ తృతీయ రోజునే థానేలోని రాజరత్నా జ్యూయలర్స్ లో చోరీ చేసి ఎంచక్కా గ్రాము రెండు గ్రాములు కాదు.. ఏకంగా ఎనిమిదిన్నర కిలోల బంగారి దోచుకెళ్ళారు. ఈ దోచుకోవడం ఏ అర్ధరాత్రి పూటో కాదు.. పట్టపగలు. మధ్యాహ్నం వరకు చాలా కష్టపడి బంగారాన్ని అమ్మిన సదరు షాపువాళ్ళు షట్టర్‌కి తాళాలు వేసి అలా వెళ్ళారో లేదో దొంగలు ఇలా గోడకి కన్నం వేసి బంగారాన్ని దోచుకెళ్ళారు. షాపు వాళ్ళ దరిద్రం ఏంటంటే, దొంగల్ని పట్టుకోవడానికి ఉపయోగపడే సీసీ కెమెరా కూడా రెండు రోజులుగా పనిచేయడం లేదట.