సోనియా ముందు నోరుజారిన చిరంజీవి
posted on May 3, 2014 @ 1:05PM
మాజీ మెగాస్టార్, త్వరలో మాజీ కేంద్రమంత్రి కాబోతున్న చిరంజీవి ఈ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఎక్కడైనా రాజకీయ పాఠాలు నేర్చుకుంటే మంచిదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకులకు కలుగుతోంది. ఎందుకంటే చిరంజీవి రాజకీయాల్లో ఏ స్టెప్ వేసినా, ఏస్టేట్‌మెంట్ ఇచ్చినా అది తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటోంది. చిరంజీవి గారి పొరపాట్లు, గ్రహపాట్ల గురించి అలా వుంచితే, లేటెస్ట్ గా ఆయన ఎక్కడ ఏం మాట్లాడకూడదో అక్కడ అదే మాట్లాడారు. శుక్రవారం నాడు గుంటూరులో జరిగిన సోనియాగాంధీ ఎన్నికల ప్రచార సభలో చిరంజీవి వీరావేశంగా మాట్లాడారు. ఆ మాట, ఈ మాట మాట్లాడిన తర్వాత తన రాజకీయ అపరిపక్వతని బయట పెట్టుకునేలా చిరంజీవి మాట్లాడారు. సోనియాగాంధీ వేదిక మీద వుండగానే చిరంజీవి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుని భారీ స్థాయిలో పొగడ్డం ప్రారంభించారు. ఏదో పీవీ పేరుని ప్రస్తావించి వదిలేయకుండా అయిదు నిమిషాలకు పైగానే పీవీని పొగిడారు. అసలు పీవీ అంటేనే సోనియాకి అస్సలు పడదన్న విషయం చిరంజీవి మరచిపోయారో, లేక పాపం ఆ విషయం ఆయనకి తెలియదోగానీ పీవీని తెగ పొగిడారు. సోనియాగాంధీని ఐదేళ్ళపాటు దేశ రాజకీయాల వైపు చూడకుండా కట్టడి చేసిన ఘనుడు పీవీ. సోనియాగాంధీకి తెలుగు రాదు కాబట్టి ఆమెకి అప్పటికి చిరంజీవి ఏం మాట్లాడారో సోనియాకి అర్థం అయి వుండకపోవచ్చు. ఎవరైనా ఆ తర్వాత సోనియాకి ఈ మేటర్ గురించి చెబితే మాత్రం ఏమైనా జరగొచ్చు.