సిరిసిల్ల సభలో నిరుద్యోగ డిక్లరేషన్.. వ్యూహాత్మకంగా రేవంత్ అడుగులు
posted on Jul 12, 2022 8:14AM
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ లో దూకుడు పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ కు సీనియర్ల మద్దతు అంతంత మాత్రంగానే లభించింది. లభిస్తోంది. ఎప్పటికప్పుడు ఆయన దూకుడుకు కళ్లెం వేయడమే లక్ష్యంగా రాష్ట్ర పార్టీలో సీనియర్లు చేయని ప్రయత్నం లేదు. అయితే వాటిని పట్టించుకోకుండా ముందుకే సాగుతున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ సభ విజయంతో పార్టీ హై కమాండ్ కూడా రేవంత్ పై విశ్వాసాన్ని ఉంచింది. సీనియర్ల ప్రయత్నాలను పట్టించుకోకుండా ముందుకు సాగమని భరోసా ఇచ్చిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళుతున్నారు. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ కు వచ్చిన భారీ స్పందనతో ఈ సారి నిరుద్యోగ డిక్లరేషన్ తో యువతకు దగ్గరవ్వాలన్న వ్యూహంతో రేవంత్ ఉన్నారని చెబుతున్నారు. వరంగల్ సభ విజయవంతం అయిన సందర్భంలోనే రాహుల్ గాంధీ స్వల్ప వ్యవధిలోనే మరో సారి రాష్ట్ర పర్యటనక వస్తానని రేవంత్ కు హామీ ఇచ్చారు. అప్పట్లోనే హై కమాండ్ అండ ఉంటుంది.. దూకుడు తగ్గించొద్దు అన్న హామీని రాహుల్ రేవంత్ కు ఇచ్చారనీ, గో ఎహెడ్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించారనీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఆ ఉత్సాహంతోనే ఈ సారి రాహుల్ పర్యటనలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు కేసీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో భారీ బహిరంగ సభ నిర్వహణకు రేవంత్ తలపెట్టారు. కుంభస్థలాన్నే ఢీ కొనే సత్తా రాష్ట్ర కాంగ్రెస్ కు ఉందని చాటడమే లక్ష్యంగా ఆయన సిరిసిల్లను ఎన్నుకున్నారని పరిశీలకులు అంటున్నారు. సిరిసిల్ల సభ వేదికగా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా యువత కాంగ్రెస్ కు చేరువ అవుతారని రేవంత్ భావిస్తున్నారు. కేసీఆర్ తరువాత పార్టీలో వాగ్థాటి ఉన్న నేతగా.. అలాగే కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవుతున్న కేటీఆర్ సొంత నియోజకవర్గంలోనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ టీఆర్ఎస్ ను ఈ సారి ఎన్నికలలో బలంగా ఢీ కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉందని చాటడమే లక్ష్యంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు.
ముందస్తు సవాళ్లతో టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం రాజకీయ డ్రామాలాడుతున్నాయని రేవంత్ విమర్శించారు. ఆ రెండు పార్టీలూ కాదు.. తాము తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన రేవంత్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ కు బీజేపీ అనుమతి ఎందుకు అని ప్రశ్నించారు. దమ్ముంటే ముందస్తుకు వెళ్లాలని ఆయన బీజేపీ, టీఆర్ఎస్ లకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ బీజేపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టో ప్రకటించి ఊరుకోవడం కాకుండా ముందుగానే మేనిఫెస్టోలో ఏం ఉండబోతున్నాయో డిక్లరేషన్ ల ద్వారా ప్రకటించి ప్రజలలో నమ్మకాన్ని కలిగించే కొత్త వ్యూహానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ తెరలేపారు. వరంగల్ డిక్లరేషన్ ను ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లేలా రచ్చబండలు నిర్వహిస్తున్నారు.
సిరిసిల్ల సభలో నిరుద్యోగ డిక్లరేషన్‌ను ప్రకటించి దానిపై కూడా ప్రజాభిప్రాయాన్ని ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని రేవంత్ ఉద్దేశంగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. తెలంగాణ సర్కార్‌పై రైతులు, నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని ఈ డిక్లరేషన్ల ప్రకటనతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపేలా చేయడమే రేవంత్ వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.