రూ.500లకే గ్యాస్ సిలెండర్ షురూ!
posted on Feb 27, 2024 @ 12:08PM
రేవంత్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీమా పరిమితి పెంపు లను అమలు చేసిన రేవంత్ సర్కార్ తాజాగా రూ.500లకే గ్యాస్ సిలెండర్ గ్యారంటీ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మంగళవారం (ఫిబ్రవరి 27) జీవో విడుదల చేసింది. సబ్సిడీ సిలెంటర్ కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారి జాబితా ఆధారంగా ఈ పథకానికి 39.5లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం లబ్ధిదారుల కోసం మూడు క్రైటీరియాలను ప్రకటించింది.
మూడు సంవత్సరాల వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని సగటు ఆధారంగా సంవత్సరానికి సిలిండర్లను లబ్ధిదారులకు అందించనుంది. మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్నాక వినియోగదారుల ఖాతాలోకి తిరిగి సబ్సిడీ అమౌంట్‌ను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ట్రాన్స్‌ఫర్ చేస్తాయి. ఈ సబ్సిడీ ట్రాన్స్ ఫర్ 48 గంటల్లోనే వినియోగదారుల అకౌంట్‌లోకి జమ అవుతుంది. . నెల నెలా ఈ సబ్సిడీ మొత్తాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ముందు ముందు సిలెండర్ కు రూ.500లనే వినియోగదారులు చెల్లించే విధంగా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా ఈ పథకానికి వైట్ రేషన్ కార్డు ఉన్నవారు అర్హులు. అయితే గ్యాస్ సబ్సిడీ కోసం వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అలాగే గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారుని పేరిటే ఉండాలి.